భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం కామన్. ఇలాంటి చిన్న చిన్న గొడవల విషయంలో సర్దుకుపోయి వైవాహిక జీవితాన్ని గడపాల్సింది పోయి చివరికి హత్యలు, ఆత్మహత్యలకు పావులు కదుపుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా భర్త కొత్త చీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లదేదనే వంటి కారణాలతో జీవితాలను మధ్యలోనే ముగింపు పలుకుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ దంపతుల మధ్య కరివేపాకు గొడవ చినిగి చినిగి చివరికి ఒకరి ప్రాణం పోయేలా చేసింది. గత రెండేళ్ల కిందట జరిగిన ఈ క్రైమ్ స్టోరీలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అది కేరళలోని మనంతవాడి పరిధిలోని మెప్పాడి ప్రాంతం. ఇక్కడే ఫర్జానా, అబ్దుల్ సమద్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2017 ఆగస్టు 15న వివాహం జరిగింది. భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక ఈ క్రమంలో కూరలో వేసే కరివేపాకు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇదే గొడవ గత వారం రోజుల పాటు జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇదంతా అందరూ నిజమే అనుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఫర్జానా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిజంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందేమోనని అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫర్జానా తల్లిదండ్రులకు అల్లుడు అబ్దుల్ సమద్ పై కొంత అనుమానం వచ్చింది. దీంతో అత్తామామలు అల్లుడు అబ్దుల్ సమద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు రెండేళ్ల పాటు విచారించారు. ఇక కట్ చేస్తే పోలీసుల రెండేళ్ల విచారణ తర్వాత ఫర్జానా మిస్టరీని పోలీసులు చేదించారు. భార్యాభర్తల మధ్య కరివేపాకు విషయంలో గొడవ జరిగిందని, ఈ కారణంతోనే భర్త అబ్దుల్ సమద్ భార్యను హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించాడని తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.