పెళ్లికి, అందానికి అవినాభావ సంబంధం ఉంది. అన్ని పెళ్లిళ్లలో కాకపోయినా.. నూటికి 70 శాతం పెళ్లిళ‍్లలో అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అమ్మాయి అయితే తెల్లగా ఉండాలని, అబ్బాయి అయితే మంచి జుట్టుతో ఉండాలని పెద్దలు అంటుంటారు. జుట్టు విషయంలో ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ ప్రాధాన్యత ఇస్తుంటారు. జుట్టు తరచుగా ఊడిపోతుంటే ప్రాణం పోయినట్లుగా ఫీలవుతుంటారు. తాజాగా, ఓ యువకుడు జుట్టు ఊడిపోతోందని, జుట్టులేని కారణంగానే పెళ్లి అవ్వటం లేదన్న బాధతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ సంఘటన సోమవారం కేరళలోని కోయికోడ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళలోని కోయికోడ్‌కు చెందిన కే ప్రశాంత్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని ఏళ్ల నుంచి అతడి జుట్టు బాగా ఉడుతోంది.
దీంతో డాక్టర్‌ను సంప్రదించాడు. వైద్య పరీక్షల్లో అతడు హార్మోన్ల సమతుల్యతతో బాధపడుతున్నట్లు తేలింది. ఇందుకోసం కోయికోడ్‌లోని ఓ స్కిన్ స్పెషాలిటీ సెంటర్‌లో చికిత్స చేయించుకుంటున్నాడు. ఏళ్లు గడుస్తున్నా జుట్టు ఊడటం ఆగలేదు. గత కొన్ని నెలలనుంచి జుట్టు మరింత ఎక్కువగా ఊడుతూ వచ్చింది. దీంతో ప్రశాంత్ త్రీవ మానసిక ఒత్తిడికి గురయ్యాడు. జుట్టు లేకపోవటం కారణంగానే తనకు వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ అవుతున్నాయని భావించాడు. ఆ బాధలో బతకటం వృధా అని భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ సూసైడ్ నోట్ రాశాడు.
ఆ నోట్‌లో.. ‘‘ స్కిన్ సెంటర్ డాక్టర్ నాకు తప్పుడు వాగ్థానాలు చేశాడు. నా సమస్య తీరుతుందని చెప్పాడు. కానీ, మందులు వాడటం మొదలు పెట్టిన తర్వాత సమస్య మరింత ఎక్కువయింది. ఆఖరికి నా కనుబొమ్మలపై వెంట్రుకలు కూడా ఊడటం మొదలైంది. నాలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోయింది. ఫంక్షన్లకు కూడా వెళ్లలేకపోయేవాడిని’’ అని రాశాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ప్రశాంత్‌ను విగతజీవిగా చూసి విలవిల్లాడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.