తన పెళ్లికి అడ్డం పడుతోందన్న కారణంతో ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టాడో యువకుడు. ఆమెను విచక్షణా రహితంగా కర్రతో చితకబాదాడు. అడ్డు వచ్చిన ఆమె తండ్రిని కూడా చావకొట్టాడు. ఈ సంఘటన కేరళలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళలోని వాకాతనానికి చెందిన శ్యామ్ పి శశిధరణ్‌కు కొన్ని నెలల క్రితం పెళ్లి కుదిరింది. అయితే, తన పొరిగింటిలో ఉండే ఓ మహిళ తన పెళ్లికి అడ్డంకులు కల్పిస్తోందని అతడు భావించాడు. ఆమె కారణంగా తన పెళ్లి ఆగిపోతుందని పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె తన పెళ్లికి అడ్డుపడకుండా చూడాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆమెను ఇంటినుంచి బయటకు లాక్కువచ్చాడు. కర్రతో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేయటం మొదలుపెట్టాడు.
ఆమె అరుస్తున్నా వదిలిపెట్టలేదు. సదరు మహిళను కాపాడటానికి వచ్చిన ఆమె తండ్రిపై కూడా కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరి అరుపులు విన్న జనం అక్కడికి వచ్చారు. శ్యామ్‌ను అక్కడినుంచి పంపేశారు. గాయపడ్డ ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లింది. దీంతో వారు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.