Crime News: ఈ మధ్య కాలంలో ఇండియాలోని పలు కోర్టులు సంచలన తీర్పులను వెలువరిస్తున్నాయి. మొన్నటికి మొన్న సుప్రీం కోర్టు పెళ్లి కాని వారు కూడా అబార్షన్స్ చేసుకోవచ్చని తీర్పిచ్చింది. అంతకు ముందు కూడా ఎన్నో జనామోదమైన తీర్పులను వెలువరించింది. ఆయా రాష్ట్రాల హైకోర్టులు కూడా చాలా విషయాల్లో సంచలన తీర్పులను ఇచ్చాయి. ఇక, నేరాలకు సంబంధించిన విషయాల్లో దోషులకు కఠిన శిక్షలను విధించాయి. తాజాగా, కేరళలోని ఓ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఓ కామాంధుడికి ఏకంగా 142 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని పతానమ్‌తిట్టకు చెందిన బాబు అనే 41 ఏళ్ల వ్యక్తి 2019లో బంధువుల ఇంట్లో ఉండేవాడు.
ఆ సమయంలో ఆ ఇంట్లో ఉంటున్న 10 ఏళ్ల బాలికపై అతడి కన్ను పడింది. బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తరచుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా దాదాపు రెండు సంవత్సరాలు బాలికను లైంగికంగా వేధించాడు. 2019-2021 మధ్య కాలలో ఈ ఘోరం జరిగింది. బాబు వేధింపులు ఎక్కువవటంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు దీనిపై పోలీసులను ఆశ్రయించారు. బాబుపై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. బాబును అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో బాబు తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు.
ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. తాజాగా, పతానమ్‌తిట్ట అడిషనల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు బాబు కేసుపై విచారణ జరిపింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి జయకుమార్ జాన్ దోషిగా తేలిన బాబుకు కఠినమైన శిక్ష విధించారు. 142 ఏళ్ల కఠిన కారగార శిక్ష విధించటంతో పాటు 5 లక్షల రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఈ తీర్పుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఈ తీర్పు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కామాంధుడికి 142 ఏళ్ల జైలు శిక్షను జనం ఆమోదిస్తున్నారు. కోర్టు మంచి తీర్పు ఇచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.