పామును వదలడం ద్వారా భార్య ఉత్తరు దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడు సూరజ్‌కేసు విషయంలో కేరళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును కేరళా పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని శాస్త్రీయ ఆధారాలతో శోధించి హత్యగా నిరూపించారు. దీంతో నిందితుడు సూరజ్ కు రెండు విడతలుగా జీవిత ఖైదు విధించాలని ఆదేశించింది.
ఇక కేసు విషయానికి వస్తే.. అది 2020.. మే 6వ తేదీ.. కేరళ రాష్ట్రంలోని కొల్లంలోని అంచల్ గ్రామం. అప్పుడే తెల్లారుతోంది. ఆ ఇంటి అల్లుడు సూరజ్ అందరికన్నా ముందుగా నిద్ర లేచాడు. పక్క బెడ్ పై నిద్రపోతున్న తన భార్య ఉత్తరని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ.., ఆమె లేవలేదు. ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం లేదు. పైగా.., నోటి భాగంలో నురుగు, చేతికి పాము కాటు గుర్తులు ఉన్నాయి. అంతే.. తన భార్యని పాము కాటు వేసినట్టు అతనికి అర్ధం అయ్యింది. భార్య చనిపోయిన బాధతో రోదనలు చేస్తూ.., అత్తమామలను లేపాడు. తమ ఇంట్లోనే.. కన్న కూతురు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. చివరికి బరువెక్కిన హృదయాలతో కూతురి అంత్యక్రియులు ముగించారు. చనిపోయిన ఉత్తర అంధురాలు.
ఆమెకు బ్యాంక్ ఉద్యోగి అయిన సూరజ్ ని భర్తగా తీసుకొచ్చారు. కాపురంలో చిన్న చిన్న సాధారణ గొడవలు తప్ప, వారి జీవితం సజావుగానే సాగిపోతూ వచ్చింది. అంతలోనే ఆమె మరణం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. ఈ బాధలో ఉండగానే ఉత్తర తండ్రికి ఒక అనుమానం వచ్చింది. నా కూతురు అంధురాలే గాని, మాటలు రాని వ్యక్తి కాదు కదా? పాము కాటు వేస్తే ఆమె పెద్దగా అరవాలి కదా? తనని ఏదో కుట్టిందని, నొప్పి పుడుతోందని పక్కనే ఉన్న తన భర్తకి చెప్పాలి కదా? మరి.. ఉత్తర అలా ఎందుకు అరవలేదు? అసలు నా కూతురిని పాము కరిచిందా? పాము కరిచేలా ఎవరైనా ప్లాన్ చేశారా? ఉత్తర చనిపోయిందా? లేక ఎవరైనా చంపేశారా? ఇలాంటి అనుమానాలు ఆ తండ్రి మదిని తొలిచేశాయి. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అల్లుడి పై కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో.., నిజాలు నిగ్గు తేల్చడానికి ఉత్తర బాడీకి మళ్ళీ శవ పరీక్షలు జరిపించారు కేరళ పోలీసులు. ఆ పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి.
ఉత్తర నిజంగానే పాము కాటుతో చనిపోయిందని ఆ టెస్ట్ లో తేలింది. కానీ.., ఆ కాటు అసాధారణంగా ఉంది. పాము ఎంతో కసిగా, పగతో కాటు వేసినంత లోతుకి గాయం అయ్యింది. ఉత్తర భర్తని మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులను సైతం అనుమానించారు పోలీసులు. అందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ముందుగా సూరజ్ ని తమదైన స్టయిల్ లో విచారించారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక అందరూ విస్తుపోయే నిజాన్ని బయటపెట్టాడు సూరజ్. ఈ క్రమంలోనే తన భార్య ఉత్తరను తాను పాము కాటుతో చంపించానని సూరజ్ ఒప్పకున్నాడు. ఇక్కడ నుండే పోలీసులకి ఈ కేసు సవాల్ గా నిలిచింది. సూరజ్.. తన నేరాన్ని అంగీకరించినా, అందుకు తగ్గ సాక్ష్యాలను మేజిస్ట్రీట్ ముందు పొందుపరచాల్సిన అవసరం పోలీసులకి ఏర్పడింది. ఇక దేశం చూపంతా కేరళ వైపే చూసేలా చేసింది ఈ కేసు. అయితే.., ఇంత ప్రెజర్ లో కూడా కేరళ పోలీసులు అద్భుతంగా ఆలోచించారు. సాక్ష్యాధారాలను సాధించడానికి సీన్ రీ కన్ స్ట్రక్షన్ పద్దతిని ఉపయోగించారు. కొల్లం జిల్లాలోని అరిప్పలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సీన్ రీ కన్ స్ట్రక్షన్ జరిపించారు. మంచంపై ఓ బొమ్మని పెట్టి.. ఆ బొమ్మపైకి నిజమైన నాగుపాముని వదిలారు పోలీసులు. కానీ.., చాలాసేపు ఆ పాము బొమ్మని కాటు వేయలేదు.
దీంతో.. చికెన్ ముక్కను ఆ బొమ్మ చేతికి చుట్టి పాము ముందు అనేకసార్లు ఊపారు. కానీ.., నాగుపాము అప్పుడు కూడా కాటు వేయలేదు. దీంతో.. చివరికి ఆ పాముని తలపై తడుతూ, పాముని బాగా రెచ్చగొట్టారు. అప్పుడు పాము ఆ చికెన్ ముక్కపై కసిగా కాటు వేసింది. ఇక్కడే పోలీసులకి కావాల్సిన సాక్ష్యం లభ్యం లభించింది. మాములుగా పాము కాటుకి అయిన గాయం వెడల్పు 1.7 సెం.మీ ఉంటుంది. అయితే.., ఉత్తర శరీరంపై పాము కరిచిన చోట 2.5 సెంటి మీటర్లు, 2.8 సెంటి మీటర్లు రెండు గాట్లను గుర్తించారు పోలీసులు. సరిగ్గా.., ఆ చికెన్ ముక్కపై కూడా 2.5 సెంటి మీటర్లు, 2.8 సెంటి మీటర్ల గాయం అయ్యింది. అంటే.. భర్త సూరజ్ పాముని రెచ్చగొట్టి మరీ.., ఆమెని కాటు వేపించాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.