Crime News: కేరళ నర బలుల ఘటనలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో నిందితులు పలు సంచలన విషయాలు వెల్లడించారు. బాధిత మహిళల్ని బలిచ్చిన తర్వాత వారి మాంసాన్ని పీక్కు తిన్నట్లు భగవత్ సింగ్, లైలాలు తెలిపారు. బాధితురాళ్ల మాంసాన్ని తిన్న తర్వాతే భూమిలో పూడ్చిపెట్టామన్నారు. ఇక, భగవత్ సింగ్ సాంప్రదాయ మసాజ్, థెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. బలి తర్వాత మహిళల మాంసాన్ని తినటం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందన్న నమ్మకంతో ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారినుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు విచారణను కొనసాగిస్తున్నారు.
కాగా, కేరళ, ఏర్నాకేళం జిల్లాలోని కలాడిలో నివాసం ఉంటున్న 52 ఏళ్ల పద్మ లాటరీ ఏజెంట్‌గా జీవనం సాగిస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీనుంచి కనిపించకుండా పోయింది. ఇక, అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల రోస్లిన్ కూడా జూన్ నెలలో కనిపించకుండా పోయింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పద్మ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పాతానమ్‌తిట్ట జిల్లాకు చెందిన భగవత్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
పద్మ, రోస్లిన్‌లను చంపేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి క్షుద్రపూజలు చేసినట్లు తెలిపాడు. క్షుద్ర పూజల్లో భాగంగా ఇద్దర్నీ బలిచ్చినట్లు పేర్కొన్నాడు. ఓ స్వామీజీ సలహా మేరకే ఇలా చేసినట్లు తెలిపాడు. మహ్మద్ షఫి అనే వ్యక్తి ద్వారా పద్మ, రోస్లిన్‌లను ఇంటికి రప్పించి హత్య చేసినట్లు వెల్లడించాడు. పోలీసులు భగవత్ సింగ్ భార్య లైలాను, మరో నిందితుడు మహ్మద్ షఫీని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.