కుక్కల పేరు చెబితేనే జనాలు ఇప్పుడు గజ గజ వణికిపోతున్నారు. రోడ్ల మీద ఒంటరిగా నడవాల్సి వస్తే.. మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు చాలా భయపడుతున్నారు. కారణం వీధి కుక్కల స్వైర విహారం. గత కొంత కాలంగా వీధి కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా కుక్కల మీద ప్రేమతో ఓ జంట హంతకులుగా మారారు. ఆ వివరాలు..
ఒకప్పుడు ఇంటికి, పొలాల దగ్గర కాపాల ఉంటుందనే ఉద్దేశంతో.. చాలా మంది కుక్కలను పెంచుకునేవారు. పెంచుకోవడం కాదు.. ఆదరించి.. పట్టెడన్నం పెట్టేవారు. దానికే ఆ కుక్కలు జీవితాంతం విశ్వాసంగా ఉండేవి. అయితే నేడు కావాలని.. వేలు పోసి మరి కుక్కలను కొనుక్కొని.. వాటిని సొంత బిడ్డలను సాకుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తమ గురించి కూడా అంత శ్రద్ధ తీసుకోరేమో కానీ.. పెంపుడు కుక్కలపై మాత్రం ఎంతో శ్రద్ధ చూపుతారు. వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టడమే కాక.. స్వయంగా స్నానం చేయించడం, అవి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వాటిని బయటకు తీసుకెళ్లడం వంటివి చేస్తారు. మొత్తానికి తమ ఇంట్లో సభ్యులుగా వాటిని భావిస్తారు. ఈ పెంపుడు కుక్కల వల్ల ఇబ్బంది కలుగుతుంది అని ఎవరైనా చెబితే.. వారితో గొడవపడటానికి కూడా రెడీ అవుతారు. ఇక తాజాగా పెంపుడు కుక్కల మీద ప్రేమతో ఓ జంట.. ఏకంగా హత్య చేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన కర్ణాటక, సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుక్కలు మల మూత్ర విసర్జన చేస్తున్నాయంటూ ప్రారంభమైన వివాదం కాస్త.. హత్యకు దారి తీసింది. శనివారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోలదేనహళ్లి ప్రాంతంలోని గణపతి నగర్‌లో మునిరాజ్ అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానిక మెకానిక్ షాప్‌లో పని చేసేవాడు. ఇక ఇదే కాలనీలో రవికుమార్, అతడి భార్య పల్లవి నివాసం ఉటున్నారు. రవికుమార్ దంపతులకు కుక్కలంటే ఇష్టం. ఈ క్రమంలో ఇంట్లో కొన్ని కుక్కలను పెంచుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.
రవి కుమార్, అతడి స్నేహితుడు ప్రమోద్ కుమార్‌తో కలిసి కుక్కలను మల, మూత్ర విసర్జన చేయించడం కోసం మునిరాజ్ ఇంటి వద్దకు తీసుకెళ్లేవారు. అతడి ఇంటి ముందే కుక్కల ములమూత్ర విసర్జన చేయించేవారు. దీనిపై మునిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. చాలా సార్లు రవి కుమార్‌తో గొడవపడ్డాడు. ఓ సారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కానీ రవి కుమార్ మాత్రం మారలేదు. ఇక శనివారం కూడా.. కుక్కలను తీసుకువచ్చి మునిరాజ్ ఇంటి ముందు మలమూత్ర విసర్జన చేయించాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది.
ఈ క్రమంలో రవికుమార్, అతడి భార్య పల్లవి, స్నేహితుడు ప్రమోద్ ముగ్గురూ కలిసి మునిరాజ్‌ను బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో మునిరాజ్.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అంతేకాక గొడవ ఆపడానికి వచ్చిన మురళి అనే యువకుడి మీద కూడా రవి కుమార్ గ్యాంగ్ దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.