నేటి కాలంలో మన సమాజంలో వయసుతో సంబంధం లేకుండా.. ఆడ జాతి మొత్తం వేధింపులకు గురవుతుంది. కొందరు ఇలాంటి దుర్మార్గాలను ఎదిరిస్తే.. చాలా మంది మాత్రం కుటుంబం, పరువు, సమాజం గురించి ఆలోచించి మౌనంగా భరించడమో.. లేక తనువు చాలించడమో చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఆడవారికి ఇంటా, బయటా ఎక్కడా రక్షణ ఉండటం లేదు. తల్లి గర్భంలో, శ్మశానంలో తప్ప ఇంక ఎక్కడ ఆడవారిని ప్రశంతంగా బతకనివ్వడం లేదు ఈ లోకం. నేటి కాలంలో చాలా మంది మహిళల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. ఇంట్లో, పని ప్రదేశాల్లో.. అన్ని ప్రాంతాల్లో వేధింపులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా లాభం లేకుండా పోతుంది. అంతకంతకు మహిళల మీద వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పని ప్రదేశంలో వేధింపులు భరించలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి ఆసారాగా ఉండటం కోసం చిన్న ఉద్యోగంలో చేరింది. అయితే పై అధికారి ఆమె మీద మనసు పడ్డాడు. తనతో మాట్లాడాలంటూ, మెసేజ్‌లు చేయాలంటూ వేధించసాగాడు. ఇలా చేయడం భావ్యం కాదని చెప్పినా అతడు వినలేదు. ఇక తన గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక.. ఆఖరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆవివరాలు..
ఈ విషాదకర సంఘటన కర్నాటక, కొడగు జిల్లా మడికెరిలో మంగళవారం వెలుగు చేసింది. కగ్గోడ్లు గ్రామానికి చెందిన సౌమ్య అనే మహిళకు కొన్నేళ్ల క్రితం జవాన్‌తో వివాహం అయ్యింది. ప్రస్తుతం అతను రిటైర్మెంట్ తీసుకుని ఇంటి వద్దనే ఉంటున్నాడు. సౌమ్య కూడా ఇంట్లోనే ఉండేది. అయితే ఖాళీగా ఉండటంతో ఏం తోచక.. ఏదైనా ఉద్యోగంలో చేరాలని భావించింది. ఈ క్రమంలో ఆమె తన ఇంటి దగ్గర ఉన్న మడికెరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది.
గత ఏడాది మేలో ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. ప్రారంభంలో బాగానే ఉంది. ఊరికి దగ్గరగా ఏదో ఒక ఉద్యోగం దొరికింది చాలు కదా అనుకుంది. అయితే సౌమ్య పని చేసే కార్యాలయంలోనే వినయ్ అనే వ్యక్తి అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. గత కొంత కాలంగా అతడు సౌమ్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. సౌమ్యపై కన్నేసిన వినయ్.. ఆమెను లైంగికంగా వేధిస్తూ.. ఇబ్బంది పెట్టేవాడు. తనకు కాల్ చేయాలని, వాట్సాప్ చాట్ చేయాలని సౌమ్యను తరచుగా వేధించేవాడు. దీని గురించి సౌమ్య తన భర్తకు చెప్పుకుని బాధపడింది. ఇక భార్యాభర్తలిద్దరూ ఎన్ని రకాలుగా హెచ్చరించినా వినయ్ తీరులో మార్పు రాలేదు. వేధింపుల పర్వం ఆగలేదు.
ఈ క్రమంలో జీవితం మీద విరక్తి పెంచుకున్న సౌమ్య దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త ఇంట్లో లేని సమయం చూసి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చి చూసేసరికి సౌమ్య విగతజీవిగా కనిపించింది. దాంతో దారుణం గురించి మడికెరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సౌమ్య భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వారు.. ఈ పనేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా.. నీ భార్య ప్రాణాలు అయినా దక్కేవి. మాజీ సైనికుడి భార్యకే వేధింపులు తప్పలేదు అంటే.. మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.