మనుషుల జీవితాలు నీటి మీద బుడగల లాంటివి. ఎప్పుడు పేలిపోతాయో ఎవ్వరమూ చెప్పలేం. చావు ఏ రూపంలో మనల్ని చేరుతుందో ఊహించలేము. అప్పటివరకు బాగానే ఉన్న వారు కుప్పకూలి చనిపోతుంటారు. ఆ పోయిన వాళ్లు వారి తాలూకా వాళ్లకు విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోతుంటారు. నిజానికి ప్రపంచంలో 20-30శాతం మరణాలకు రోడ్డు ప్రమాదాలే కారణం. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఏ పాపమూ చేయని వాళ్లు ప్రమాదానికి గురవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ డిగ్రీ స్టూడెంట్ మృత్యువాతపడింది. రోడ్డుపై వెళుతున్న ఆమెపైకి క్రేన్‌తో దూసుకుపోయాడు ఆ డ్రైవర్. దీంతో గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన నూర్ ఫిజా అనే యువతి డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం కన్నమంగల బస్టాండ్‌నుంచి ఇంటికి బయలు దేరింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. అదే రోడ్డుపై ఆమెకు ఎదురుగా ఓ మొబైల్ క్రేన్ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో వాహనం అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న నూర్‌పైకి దూసుకెళ్లింది. ఆమె పక్కకు తప్పుకునేలోగానే పైనుంచి దూసుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడ్డ నూర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.