ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఓ వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడవారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడంటూ ఆమె ఆరోపించారు.
ప్రముఖ నటి నటి, ఆదిభట్ల శ్రీ కళాపీఠం అధ్యక్షురాలు, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు కరాటే కళ్యాణి ఓ వ్యక్తిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడవారి అందం గురించి తప్పుగా మాట్లాడుతూ చేసిన వీడియోపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకప్, లిప్ స్టిక్ వంటి సౌందర్య సాధనాలు వాడే మహిళలను అసభ్యపదజాలంతో దూషిస్తూ కించపరిచాడని ఆమె ఆరోపించారు. కృష్ణ ధర్మ రక్షణ అధ్యక్షుడు కెల్లా దుర్గారావు మహిళలను కించపరిచేలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మరక్షణ పేరుతో విజయవాడ వేదికగా ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.
మహిళల సౌందర్యంపై నీచమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు చేస్తున్నాడని.. కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖానికి పౌడర్ రాసుకోవడం, లిప్ స్టిక్ వేసుకోవడం ఏదో నేరం అన్నట్టు మాట్లాడుతున్నాడని, సౌందర్య సాధనాలను వాడే మహిళలందరినీ తిడుతున్నాడని కరాటే కళ్యాణి ఆరోపించారు. అందంగా తయారైతే తప్పా? స్త్రీలు అందంగా తయారవ్వకూడదా? అని ప్రశ్నించారు. హిందూ ధర్మం కోసం మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని.. తనతో పాటు ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారని.. ఆమె కూడా సౌందర్య సాధనాలు వాడుతుంది. అది కూడా తప్పేనా అని ప్రశ్నించారు.
మహిళను కించపరిస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. దుర్గారావు లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలను అందరం కలిసి ప్రతిఘటించాలని, ప్రతి మహిళా దీనిపై ప్రశ్నిస్తున్నారని, తనకు చాలా మంది ఫోన్లు చేసి మద్దతు తెలుపుతున్నరని అన్నారు. ఖచ్చితంగా దుర్గారావుని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దుర్గారావు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని.. అతనికి భగవంతుడు సద్భుద్ధిని, సత్ప్రవర్తనను ప్రసాదించాలని, అతని ప్రవర్తనలో మార్పు రావాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.