ప్రేమంటే ఇదేరా అని మాటల్లో కాదు చేతల్లో చూపించారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కల కాలం తోడుగా ఉండాలనుకుని కలిసి నడిచారు. ఎంతో అద్భుతంగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. అనారోగ్యంతో భార్య మరణించడంతో తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన గణేష్ అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. గణేష్ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు.
అయితే ఈ క్రమంలోనే గణేష్ కర్ణాటకలోని వైఎన్ హెచ్ కోటకు వెళ్లాడు. బేల్దారి పని కోసం వెళ్లిన గణేష్ కు స్థానికంగా ఉండే గగనశ్రీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు గగనశ్రీని మంగళూరులోని ఓ కాలేజీలో బీటెక్ చదివించారు. ఈ విషయం తెలుసుకున్న గణేష్ సైతం మంగుళూరుకు వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్నాళ్లకి గణేష్ గగనశ్రీని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా చదువు మధ్యలోనే ఆపేసి కళ్యాణదుర్గానికి తీసుకొచ్చాడు.
అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఇక్కడే కాపురం చేశారు. దీంతో గగనశ్రీ మూడు నెలల గర్భవతి అయింది. ఈ నేపథ్యంలోనే గగనశ్రీ జ్వరంతో బాధపడుతుండడంతో భర్త గణేష్ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా కోలుకోకపోవడంతో మరోసారి డాక్టర్ ను సంప్రదించగా..,ఆమెకు వచ్చింది డెంగ్యూ జ్వరమని వైద్యులు నిర్ధారించారు. దీంతో గణేష్ మెరుగైన వైద్యం కోసం భార్యను మరో ఆస్పత్రికి తరలించే క్రమంలోనే గగనశ్రీ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది.
భార్య మరణించడంతో భర్త గణేష్ కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. ఇక భార్య లేని లోకంలో నేను ఉండలేను అనుకుని ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో గణేష్ తల్లిదండ్రులు కన్నటి శోకంలో మునిగితేలారు. ఇదిలా ఉంటే గగనశ్రీ తల్లిదండ్రులు మాత్రం మా కూతురుని అత్తింటివాళ్లే చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. భార్య భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.