అద్భుతమైన చోరీ సీన్లు సాధారణంగా మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. దొంగలు ఎంతో తెలివిగా క్షణాల్లో దొంగతనం చేసేస్తుంటారు. వారు దొంగతనం చేసే తెలివికి ఒక్కోసారి మనమే నోరెళ్ల బెట్టాల్సి వస్తుంది. అచ్చం సినిమాను తలపించే ఓ దొంగతనం సీన్ కడపలో చోటుచేసుకుంది. ఓ కంటైనర్‌నుంచి కోట్లు విలువ చేసే సామాన్లను కొట్టేశారు కొందరు వ్యక్తులు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హరియాణాకు చెందిన ఓ కంటైనర్ లారీ పది రోజుల క్రితం చెన్నై బయలు దేరింది. ఆ కంటైనర్ నిండా ఖరీదైన ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు. కంటైనర్ ముంబై, హైదరాబాద్, కడప మీదుగా చెన్నైకి వెళుతోంది.
కట్ చేస్తే…
కంటైనర్ చేరుకోవాల్సిన సమయంలో గమ్యస్థానాన్ని చేరుకోలేదు. దాని గురించి లోడ్ యజమానులకు ఎలాంటి సమచారం లేకుండా పోయింది. దీంతో కంటైనర్‌ను పంపిన కొరియర్ సర్వీస్ వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వాళ్లు రంగంలోకి దిగారు. కంటైనర్‌ను వెతికే పనిలోపడ్డారు. ఈనేపథ్యంలోనే కంటైనర్ దేవుడి కడప ఆర్చి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కనిపించింది. పోలీసులు దాని దగ్గరకు వెళ్లి తలుపులు ఓపెన్ చేశారు. అక్కడి దృశ్యాన్ని చూసి వారు షాక్ తిన్నారు. కంప్లైంట్ వచ్చిన ప్రకారం అందులో ఎలాంటి వస్తువులు లేవు. కంటైనర్ మొత్తం ఖాళీగా ఉంది. వారికి అర్థం కాని విషయం ఏంటంటే.. నిర్వాహకులు ఎంతో పకడ్బందీగా కంటైనర్‌ను కోడింగ్‌తో లాక్‌చేసి మరీ పంపించారు.
అలాంటి దాన్ని ఎవరు ఓపెన్ చేశారు? అన్న ప్రశ్న తలెత్తింది. దీంతో పోలీసులు దొంగతనం కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. డ్రైవర్ కోసం వెతికారు. అతడు కూడా కనిపించలేదు. 10 రోజుల క్రితమే అతడు లారీని వదిలేసి పారిపోయినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు విచారణ మొదలుపెట్టారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఇద్దరు వ్యక్తుల సహాయంతో కంటైనర్ డ్రైవరే ఈ దొంగతనానికి ఒడిగట్టినట్లు తెల్చారు. పక్కాప్లాన్ ప్రకారమే ఈ దొంగతనం జరిగిందని వెల్లడించారు. కంటైనర్ దేవుడి కడపకు రాగానే డ్రైవర్ మరో ఇద్దరి సహాయంతో ఈ దొంగతనం చేశాడు. పోలీసుల వారి దగ్గరినుంచి ల్యాప్‌ల్యాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.