రేపొద్దున ఏ కష్టమొస్తుందో అన్న ఆలోచనతో రూపాయి.. రూపాయి పోగు చేసి బ్యాంకులో దాచుకోవడం ఈ రోజుల్లో సహజం. అలాకాకుండా, ఆ డబ్బులను ఇంట్లో పెడదామా? అంటే.. ఖర్చుపెట్టేస్తామో అన్న ఆలోచన, ఏయే మనకేం ఖర్చులుంటాయిలే అనుకొని ఇంట్లోనే పెట్టాం అనుకోండి. నిద్ర పట్టదు. ఎక్కడ దొంగలు పడి.. దోచుకెళ్తారేమో అని. పోనీ, బ్యాంకులో దాచామనుకోండి. అక్కడైనా సేఫ్ గా ఉంటుందా? ఉండట్లేదు.. అక్కడా దొంగలుంటున్నారు. కానీ, అక్కడ దొంగలు బయటవారు కాదు.. ఇంటి దొంగలే ఆ పని కానిస్తున్నారు. నిజం సుమా! మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వివరాలు
మెదక్ జిల్లా నర్సాపూర్, ఎస్‌బీఐ బ్రాంచిలో నాగేందర్ అనే వ్యక్తి నాగేందర్.. నగదు ఇన్‌ఛార్జీగా విధులు నిర్వర్తించేవాడు. రోజూ పొద్దున్నే లేవడం.. నీటుగా రెడీ అవ్వడం.. అదేనండి.. ఠక్కు గట్రా చేయడం.. బ్యాంకుకు వచ్చేయడం. ఇలానే బాగానే వచ్చాడు కొన్నాళ్ళు. అందరూ బాగా నమ్మారు. అయితే.. ఉన్నట్టుండి గత జూన్ 21 నుంచి కనపడకుండా పోయాడు. పోనీ, సమాచారం ఉందా అదీ లేదు. సరే.. ఎందుకు రావట్లేదో, అసలు విషయం కనుక్కుందామని ఫోన్ చేస్తే.. మా బంధువు ఒకరు చనిపోయారు.. నాకు కాస్త టైమ్ పడ్తది అని చెప్పి.. ఓ కస్టమర్ చేత స్ట్రాంగ్ రూం తాళాలను బ్యాంకుకు పంపాడు. ఇక్కడే.. బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి స్ట్రాంగ్ రూం లాకర్లు తెరిచి పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
స్ట్రాంగ్ రూములో దాచే డబ్బులు, కస్టమర్ల బంగారు స్వాహా అయినట్లు గుర్తించారు. ఎంత పోయాయా? అని లెక్కపెడితే.. 2 కోట్ల 32లక్షల నగదు, సుమారు 72 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. ఆ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వారి ఆదేశాలతో స్ట్రాంగ్ రూం, ఏటీఎంలలోని.. సీసీ కెమెరాలను తనిఖీ చేస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 25నస్ట్రాంగ్‌రూంను ఒక్కడే తెరిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి. ఎవరూ గమనించని సమయంలో నాగేందర్ లాకర్ తెరిచి ఖాతాదారులకు చెందిన నగదు, ఆభరణాలు దోచుకెళ్లాడు.
అంతటితో ఆగాడా! లేదు. ఆపై ఏటీఎంలలోని డబ్బునూ కాజేశాడు. ఆ తర్వాత కూడా నాలుగు నెలల పాటు బ్యాంకుకు వచ్చివిధులు నిర్వహించాడు. మొత్తానికి నాగేందర్ దోచుకెళ్లిన మొత్తం.. ఐదు కోట్లకుపినేనట. ఈ విషయంపై సీబీఐకి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడంతో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నాగేందర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బ్యాంకులోని నగదు, నగలు మాయం చేసిన ఘటనలో నాగేందర్‌తోపాటు జాయింట్ కస్టోడియన్ల పాత్రపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియాజేయండి.