ప్రేమలో అలకలు, పొససివ్‌నెస్ అన్నవి సర్వసాధారణం. అయితే, అలకల కంటే పొససివ్‌నెస్ ఎంతో ప్రమాదకరమైనది. అది గనుక అనుమానంగా మారితే ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమ మనల్ని ఎంతటికైనా తెగించేలా చేస్తుంది. తాజాగా, ఓ యువతి ప్రియుడిపై అనుమానంతో దారుణమైన పని చేసింది. ఏకంగా అతడి ఇంటినే తగలబెట్టింది. అంతేకాదు! ఇంట్లోని వస్తువుల్ని కూడా దొంగతనం చేసింది. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బెక్సార్ కౌంటీ షరీఫ్ ఆఫీస్ తెలిపిన వివరాల మేరకు.. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సెనైడా మ్యారీ సోటో అనే 23 ఏళ్ల అమ్మాయి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సోటో కొద్ది రోజుల క్రితం తన ప్రియుడికి ఫోన్ చేసింది. అవతలినుంచి ఓ అమ్మాయి ఆ ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేసి మాట్లాడింది. తన ప్రియుడి ఫోన్‌నుంచి ఎవరో అమ్మాయి మాట్లాడటంతో సోటోకు అనుమానం మొదలైంది. ఆ అనుమానం ఆగ్రహంగా మారింది. దీంతో ప్రియుడిపై కక్ష సాధించాలని ఆమె భావించింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో అతడి ఇంట్లోకి దూరింది. కొన్ని వస్తువుల్ని దొంగిలించింది. తర్వాత హాలులోని సోఫాను తగులబెట్టింది. దాన్ని వీడియో తీసి ప్రియుడికి పంపింది. ‘‘ మిగిలిన వస్తువుల బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను’’ అని పేర్కొంది.
అయితే, ఆ మంటలు కొద్దిసేపటి తర్వాత ఇళ్లు మొత్తం వ్యాపించాయి. ఇళ్లు మొత్తం కాలి బూడిదైంది. లక్షల్లో ఆస్తినష్టం వచ్చింది. సోటో ప్రియుడి కుటుంబం వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెపై రెండు అరెస్ట్ వారెంట్‌లు జారీ చేశారు. తర్వాత సోమవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెకు అస్సలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సోటోతో ప్రియుడి ఫోన్‌లో మాట్లాడిన అమ్మాయి అతడి బంధువని వారు వెల్లడించారు. దీంతో సోటో కంగుతింది. తొందరపడి తప్పుచేశానని కుమిలిపోయింది. అయితే, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.