ప్రేమ- పెళ్లి.. ఈ రెండింటి గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎక్కువయ్యాయనే చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు కన్న పిల్లల కంటే కట్టుబాట్లు ఏమీ ఎక్కువ కాదు అంటున్నారు. పిల్లలు ఇష్టపడిన వారితోనే వివాహం చేస్తున్నారు. ఇంకొందరు తల్లిదండ్రులు అయితే నీకు నచ్చిన పెళ్లి చేసుకుంటే మాతో నీకు సంబంధం లేదు అనే మాటని ఇంకా వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే వాళ్లు మాత్రం అంతకు మించిన పని చేశారు. కన్నకూతురు అనే కనికరం కూడా లేకుండా దారుణంగా ప్రవర్తించారు. ఇష్టంలేని పెళ్లి చేసుకుందని అపహరించి.. శిరోముండనం చేయించారు.
పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లాకు ప్రేమికుల ప్రేమికుల కథ ఇది. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన యువతిని ప్రేమించాడు. వాళ్లిద్దరు ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకోవాలని యువతి కూడా ఫిక్స్ అయిపోయింది. అయితే పెద్దవాళ్లకు వారి ప్రేమ విషయాన్ని చెప్పారు. వెనుకటి సినిమాల్లో లాగానే పెద్దలు వారి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. పెద్దవాళ్లు వద్దు అని చెప్పినా కూడా ఆ యువతి ప్రేమించిన మధునే వివాహం చేసుకునేందుకు సిద్ధపడింది. వాళ్లిద్దరూ రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు.
ప్రస్తుతం ఆ యువతి అత్తగారింట్లోనే ఉంటోంది. అయితే యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రెండుకార్లలో యువకుడి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వారిపై దాడి కూడా చేశారు. వారి కుమార్తెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వద్దు అంటూ ఆమె కేకలు వేస్తున్నా కూడా.. బలవంతంగా కారులోనే శిరోముండనం చేయించారు. అక్కడితో ఆగకుండా రాత్రంతా ఆమె మనసు మార్చేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ యువతి మాత్రం ప్రేమించి పెళ్లాడిన యువకుడిని వదులుకోనని గట్టిగా చెప్పింది. చేసేది లేక ఆమెను వదిలిపెట్టారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న యువతి జరిగింది పోలీసులకు వివరించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు యువతి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.