జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని బంధించి.. అతడి భార్యకు ఫోన్ చేసి.. రాత్రి తమతో గడిపితేనే.. నీ భర్తను వదిలేస్తామంటూ మహిళను బెదిరించి.. అర్థరాత్రి నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో నివాసం ఉండే ఓ వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో ఐదేళ్లుగా పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య (36), ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈ క్రమంలో సదరు వ్యక్తి జనవరి 4న స్వగ్రామం చినమెట్ పల్లికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి బాగా కల్లు తాగాడు. మత్తులోనే ఇంటికి బయలు దేరాడు. తూలుతూ వస్తోన్న వ్యక్తిని గమనించిన అదే గ్రామానికి చెందిన నాగరాజు (26), తిరుపతి (24), రఘు (24).. కోరుట్లలో దింపుతామని తమ కారులో ఎక్కించుకున్నారు. తర్వాత అతడి భార్యకు ఫోన్‌చేశారు. ‘నీ భర్త మా దగ్గర ఉన్నాడు.. నువ్వు ఈ రాత్రి మాతో గడిపితేనే నీ భర్తను అప్పగిస్తాం’ అని బెదిరించారు. తర్వాత రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భీమునిదుబ్బలోని బర్రెల మంద వద్దకు చేరుకున్నారు.
ఈ క్రమంలో సదరు మహిళ తన బంధువులకు ఫోన్ చేసి.. జరిగిన విషయం చెప్పింది. తనకు సాయం చేయాల్సిందిగా కోరింది. ఆ తర్వాత నిందితులు చెప్పిన బర్రెల మంద ప్రాంతానికి వెళ్లింది. తన భర్తను వదిలేయాల్సిందిగా ప్రాధేయపడింది. కానీ నిందితులు ఆమె అభ్యర్థనను పట్టించుకోకుండా.. ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. ఆ దృశ్యాలను వీడియో తీశారు. అదే సమయంలో బాధితురాలి అభ్యర్థన మేరకు ఆమె బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వారిని చూసిన నాగరాజు బృందం దంపతులను కారులో ఎక్కించుకుని వారి ఇంటి దగ్గర దింపేశారు. ఈ లోపు బాధితురాలి బంధువులు అక్కడకు చేరుకోవడంతో.. వారిని చూసి నాగరాజు బృందం అక్కడ నుంచి పరారయ్యారు. జరిగిన సంఘటన గురించి బాధితుడు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై మీ వివరాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.