ఈ మద్య ఈజీ మనీ కోసం చాలా మంది చెడు మార్గాలు అన్వేశిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ లో పాల్గొంటూ కొంతమంది ఈజీగా మనీ సంపాదిస్తుంటే.. కోట్ల మంది డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తల్లి దండ్రులు పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తూ కన్నవారి కలల్ని చిదిమేస్తున్నారు. చెడు స్నేహానికి పోయి విలాసాలకు అలవాటు పడుతున్నారు. సులభంగా మనీ సంపాదించేందుకు వెనక ముందు ఆలోచించకుండా చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. పర్యవసానాన్ని గుర్తించకుండా చనువు చాలిస్తున్నారు. అలాంటిదే మహారాష్ట్రలో కూడా ఓ సంఘటన జరిగింది. క్రికెట్ బెట్టింగ్ లో అప్పులపాలైన ఓ యువకుడు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి మనస్తాపంతో చనిపోయింది. వివరాల్లోకి వెళితే..
ఖితాన్ వాధ్వానీ అనే యువకుడు తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి మహారాష్ట్ర చాపర్ నగర్ చౌక్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. తల్లి గృహిణి, తండ్రి హోల్ సేల్ వ్యాపారి. కాగా ఖితాన్ క్రికెట్ బెట్టింగ్ లకు బాగా అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్స్ కోసం ఏకంగా తన సెల్ ఫోన్ కూడా బెట్టింగ్ లో తాకట్టు పెట్టేశాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో తల్లికి ఈ విషయం తెలిసింది. బెట్టింగ్స్ తో డబ్బు పోగొట్టుకుంటున్న కొడుకునే చూసి తల్లి ఖితాన్ ను గట్టిగా మందలించింది. దీంతో తల్లి మాటలకు ఖితాన్ మనస్తాపం చెందాడు. తర్వాత సోమవారం వారి కుటుంబసభ్యులందరు బంధువుల పెళ్లికి వెళ్ళారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న ఖితాన్ వంటగదిలో ఉరేసుకుని చనిపోయాడు. ఊరు నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూడడంతో కన్నీరుమున్నీరుయ్యారు. తల్లి దివ్య మనస్తాపంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిస్తుంటే మధ్యలోనే మరణించింది. ఈ హృదయ విదారకమైన ఘటన ఊరిలోని వారందరిని కలచివేసింది. ఒకే ఇంట్లో కొడుకు, తల్లి ఒకేసారి చనిపోవడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.