సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఏమాత్రం కష్టపడకుండా.. డబ్బులు సంపాదించాలని భావిస్తున్నవారు ఎక్కువ అవుతున్నారు. ఇందుకోసం ఆఖరికి తమను తాము అమ్ముకోవడానికి కూడా కొందరు సిద్ధపడుతున్నారు. ఈ మాటలు వినడానికి కాస్త కష్టంగా అనిపించినా.. కొందరి వ్యవహార శైలి చూస్తే.. ఈ మాటలు నిజమే అనిపించక మానదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సామాన్యులు కూడా సెలబ్రిటీ స్టేటస్ అందుకుంటున్నారు. మిలియన్స్‌లో ఫాలోవర్స్‌ను సంపాందించుకుని.. ఆదాయంతో పాటు.. జనాల ఆదరణ కూడా పొందుతున్నారు. అయితే కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రం.. ఆదాయం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన ఓ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసం దొంగతనాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో ఇన్‌ఫ్లుయెన్సర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకరు ఫాలోవర్స్‌నే బెదిరిస్తూ.. కోట్ల రూపాయలు వసూలు చేస్తూ పోలీసులకు చిక్కింది. ఆ వివరాలు..
మోహాలికి చెందిన జస్నీత్ కౌర్ అలియాస్ రజ్బీర్ కౌర్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కారణం ఆమె తన ఫాలోవర్స్‌ని బెదిరిస్తూ.. వారి వద్ద నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తుంది. తాజాగా ఓ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన ఫిర్యాదుతో లుధియానా పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. జస్నీత్ కౌర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సెమి న్యూడ్ ఫొటోలు, గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తు ఉంటుంది. ఇక ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ స్టా బయోలో తనను తాను మోడల్, నటిగా చెప్పుకుంది జస్నీత్.
జస్నీత్‌కు ఇన్‌స్టాలో మాత్రమే కాక టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి వాటిల్లో కూడా అకౌంట్స్ ఉన్నాయి. వీటిల్లో అర్థ నగ్న ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె పోస్ట్ నచ్చి.. ఎవరైనా డబ్బున్న వ్యక్తులు, బిజినెస్ మ్యాన్ కామెంట్స్ చేస్తే.. వారితో నెమ్మదిగా పరిచయం పెంచుకుంటుంది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వారితో చాట్ చేస్తుంటుంది. అసభ్య సంభాషణలు సాగించి.. వాటిని రికార్డ్ చేసుకుని.. ఆ తర్వాత తన అసలు రంగు చూపిస్తోంది. తను అడిగిన మొత్తం ఇవ్వకపోతే.. ఆ చాట్‌ను లీక్ చేస్తానని బెదిరిస్తుంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో గుర్బీర్ అనే వ్యక్తిని ఇలానే బెదిరించి అతడి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అంతేకాక తన టార్గెట్‌లను బెదిరించడం కోసం అవసరమైతే.. గ్యాంగ్‌స్టర్స్ సాయం కూడా తీసుకునేది. సుమారు 15 ఏళ్ల క్రితం అనగా 2008లో జస్నీత్ కౌర్ మీద ఇదే తరహా కేసు నమోదు అయ్యింది. ఇక తాజాగా లుధియానాలో నమోదైన కేసులో భాగంగా పోలీసులు జస్నీత్‌కు అదుపులోకి తీసుకున్నారు. 33 ఏళ్ల వ్యక్తి ఒకరు జస్నీత్ మీద ఫిర్యాదు చేశారు. 2022, నవంబర్‌లో జస్నీత్ ఒక తెలియని నంబర్ నుంచి కాల్ చేసి.. తను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను బయటపెడతానని.. అతడితో పాటు.. అతడి కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. దాంతో అతడు లుధియానా పోలీసులను ఆశ్రయించడంతో జస్నీత్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.