ఒకప్పుడు ఏ జంటను చూసినా.. ‘ఎంత అన్యోన్యమైన జంట, చూడముచ్చటగా ఉన్నారు’ కదా అనేవారు. ఇప్పుడు ఏ జంటను చూసినా.. ‘హే వారి గురుంచి మాట్లాడుకోవటమే వేస్ట్.. ఎప్పుడు కొట్టుకు చస్తుంటారు..’ ఇలా మాట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆగ్రహంతో చేయి చేసుకునే భర్తలు కొందరైతే.. కోపమొచ్చిందా! పుట్టింటికి వెళ్తా అనే భార్యలు మరికొందరు. వీరి దాంపత్యజీవితం ఏమో కానీ, వీరి గొడవలను సద్దుమణిగించలేక.. వీరి తల్లిదండ్రులు, పోలీసులు, న్యాయవాదులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా, ఓ అన్యోన్య దంపతుల కాపురంలో సెల్ ఫోన్ చిచ్చురేపింది. భార్య అతిగా ఫోన్ మాట్లాడుతోందని భర్త… భర్త ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని భార్య మధ్య మొదలైన గొడవ కేసు పెట్టే వరకు వెళ్ళింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. మంచి జీతం.. హ్యాపీ లైఫ్.. సజావుగా సాగుతున్న కాపురంలో సెల్ ఫోన్ చిచ్చుపెట్టింది. భార్య ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతోందని భర్త.. భర్త ఫోన్ సీక్రెట్ లాక్ చెప్పడం లేదని భార్య రోజూ గొడవపడుతుండేవారు. ఈ నేపథ్యంలో భర్త నుంచి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని భార్య ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వేధిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవా లని కోరింది. భార్యభర్తలిద్దరూ విద్యావంతులు, పైగా ప్రభుత్వ ఉద్యోగులు కదా! కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుందని పోలీసులు అనుకున్నారు. కొన్ని రోజులపాటు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.
అయితే, ఆ దంపతులిద్దరూ దారికి రాకపోవడం కాదు కదా! పట్టువదలని విక్రమార్కుల్లా భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు మరో ఉపాయం కోసం ఆలోచించారు. అందుకోసం వారి డిమాండ్లు ఏమిటో తెలుసుకోవాలనుకుని.. ఇద్దరినీ ప్రశ్నించారు. తన భార్య ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతోందని, ఆమె ఫోన్ తన వద్ద ఉంచాలని ప్రతిపాదన పెట్టాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. పైగా తాను ఫోన్లు మాట్లాడితే ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటని, తనకు ఫోన్ స్వేచ్ఛ కావాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే.. తన డిమాండ్ ను వినిపిస్తూ.. తన భర్త ఫోన్ కు సీక్రెట్ లాక్ పెట్టు కున్నారని, దాని వివరాలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదన విన్న భర్త, అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. దీంతో విసిగిపోయిన పోలీసులు కేసు నమోదు చేస్తామని ఆయనను బెదిరించారు. అయినా పర్వాలేదు, పాస్‌వర్డ్ మాత్రం చెప్పబోనని తెగేసి చెప్పాడు. దీంతో పోలీసులు చివరికి భర్తపై ఐపీసీ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు.
అత్తింట వధువుల వరకట్న చావులను, మహిళలపై వేధింపులను అడ్డుకునేందుకు 1983లో ఐపీసీ సెక్షన్ 498(ఎ) ప్రకారం వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం కింద అలాంటి వేధింపులు ఎదుర్కొన్న నిందితులు ఎవరైనా పిర్యాదు చేస్తే.. భర్త, అతడి కుటుంబ సభ్యులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు. అయితే, ఈ చట్టం ఇటీవల దుర్వినియోగం అవుతోందని ఒక రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. అసంతృప్త భార్యలు ఈ సెక్షన్‌ను రక్షణ కవచంగా కాకుండా ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. భర్త, అతని బంధువులను సులభంగా వేధించేందుకు, అరెస్ట్ చేయించేందుకు ఉపయోగిస్తున్నారని ఒక కేసు తీర్పు సందర్బంగా వ్యాఖ్యానించింది. ఈ అన్యోన్య దంపతులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.