సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఓ భవంతిలో మంటలు వ్యాపించి ఎనిమిది మంది ప్రణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలుఅయ్యాయి. లాడ్జిలో బస చేస్తున్న వీరు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎలక్ట్రిక్ షోరూమ్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగానే వీరు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. పాస్ పోర్టు కార్యాలయం సమీపంలోనే లగ్జరీ ప్రైడ్ అనే ఐదంస్థుల భవనం ఉంది.
ఆ భవనంలోని సెల్లార్ లో ఓ ఎలక్ట్రిక్ షోరూం ఉంది. మిగిలిన నాలుగు అంతస్థుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.40 గంటల సమయంలో ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలిపారు. అవి కాస్తా బైకులకు కూడా అంటుకోవడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. బ్యాటరీలు దగ్ధమయ్యి దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. మెట్ల మార్గం ద్వారా ఈ మంటలు పై అంతస్థుల్లోని హోటల్ కు వ్యాపించాయి. హోటల్ లో బస చేస్తున్న పర్యాటకులు దట్టమైన పొగకు ఊపిరాడక కొందరు స్పృహ కోల్పోయారు. విద్యుదాఘాతంతో కరెంట్ కట్ అయ్యింది. చుట్టూ పొగలు, విద్యుత్ లేదు ఏమౌతోందో తెలియక పర్యాటకులు హాహాకారాలు చేశారు.
వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో హోటల్ లో మొత్తం 25 మంది పర్యాటకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న ఘటనాస్థలికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయచర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను గాంధీ, యశోద ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నగర సీపీ ఆనంద్, అగ్నిమాపక శాఖ అడిషినల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, డీసీపీ చందనా దీప్తీ కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాంధీలో 30 మంది వైద్య బృందం బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో విజయవాడకు చెందిన హరీశ్, చైన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వితేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.