స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి శివారు ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్కూలు పిల్లలతో వెళుతున్న ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ బాలుడు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంకర్‌పల్లికి చెందిన కొందరు పిల్లలు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, బీడీఎల్ భానూరులోని డీఏవీ స్కూల్లో చదువుతున్నారు. స్కూలుకు వెళ్లటానికి బస్సు సౌకర్యం లేకపోవటంతో అందరూ ఆటోలో స్కూలుకు వెళ్లి వస్తూ ఉంటారు. రోజూ లాగే బుధవారం రోజు కూడా ఆటోలో స్కూలుకు వెళ్లారు. మధ్యాహ్నం స్కూలు అయిపోయిన తర్వాత ఇంటికి తిరుగుప్రయాణం అయ్యారు.
ఆటోలో సరదాగా పిల్లలు నవ్వుతూ.. తుళ్లుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో జరగబోయే విషాదం గురించి వారికి తెలీదు. శంకర్ పల్లి సమీపంలోకి రాగానే.. ఆటో అదుపు తప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంతోష్-బీనా దంపతుల బిడ్డ సీనా చనిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. పరిమితికి మించి పిల్లలను ఆటోలో ఎక్కించటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.