బిడ్డలకు చిన్న కష్టం వస్తేనే తల్లి విలవిల్లాడుతుంది. వారి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేసి మరి కాపాడుకుంటుంది. కానీ ఓ చోట మాత్రం ఇందుకు విరుద్ధమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఆదివారం అందరూ ఎంతో సంతోషంగా మదర్స్‌డే రోజు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని , ఆమె త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మాతృమూర్తికి కృతజ్ఞతలు తెలిపి మురిసిపోయారు. అయితే అందరూ మదర్స్ డే సెలబ్రేషన్స్‌లో ఉంటే ఓ తల్లి మాత్రం దారుణ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి ప్రతి ఒక్కరు బాదపడుతున్నారు. పిల్లలని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి.. వారి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని కుబ్యా తండాకు చెందిన శ్రీనివాస్, భారతిలకు 2020లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు మీర్‌పేట్ పీఎస్ పరిధిలోని జిల్లెలగూడలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు విక్కీ (18 నెలలు), లక్కీ (8 నెలలు) ఉన్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీనివాస్ తల్లి వీరి ఇంటి వద్దకు రాగా.. దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దాంతో ఆదివారం ఉదయం భారతి తల్లిదండ్రులు కూడా శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. మళ్లీ దంపతుల మధ్య వివాదం ప్రారంభం అయ్యింది.
భార్యాభర్తలిద్దరు గొడవపడటంతో.. శ్రీనివాస్ బయటకు వెళ్లాడు. గొడవ కారణంగా అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన భారతి (26) ఆదివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్‌లో ముంచి చిన్నారులు ఇద్దరిని హత్య చేసింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పైగా బిడ్డలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని శ్రీనివాస్‌కు కాల్ చేసి చెప్పింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకున్న శ్రీనివాస్.. పిల్లలను, భార్యను దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. వారిని పరీక్షించిన వైద్యులు చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
భార్య భారతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు శ్రీనివాస్. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మాతృదినోత్సం రోజున ఇద్దరు పిల్లను చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.