వారిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. కానీ భర్త తీసుకున్న నిర్ణయంతో పట్టుమని మూడేళ్లు కూడా లేని ఇద్దరు చిన్నారులు అనాధలు అయ్యారు. ఆ వివరాలు..
వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు. ప్రేమించిన భర్త.. పండంటి బిడ్డలతో వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది. అయితే వారు అంత ఆనందంగా ఉండటం చూసి విధికి కన్నుకుట్టింది. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం భార్య మృతి చెందింది. పట్టుమని మూడేళ్లు కూడా లేని చిన్నారులను, ప్రాణంగా ప్రేమించే భర్తని వదలివెళ్లింది. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. ప్రాణంగా ప్రేమించిన భార్య.. అర్ధాంతరంగా వదిలి వెళ్లడంతో.. అతడు కుంగిపోయాడు. భార్యను వదిలి ఉండలేక.. ఆత్మహత్య చేసుకుని.. ఆ చిన్నారులను అనాధలను చేశారు. కళ్లల్లో పెట్టుకుని చూడాల్సిన తల్లిదండ్రులు.. కనరాని లోకాలకు వెళ్లారని తెలియక.. అమ్మానాన్న కావాలంటూ ఏడుస్తోన్న ఆ పసి వాళ్లను చూపి ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు.
ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వెస్ట్ మారేడుపల్లి పికెట్ గాంధీకాలనీకి చెందిన దాసరి అఖిల్(24), మియాపూర్‌కు చెందిన మౌనిక(24)ను 2019లో ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. రెండున్నరేళ్ల ప్రణవ్, ఏడాది వయస్సున్న హారిక పిల్లలు. అయితే అనారోగ్యం కారణంగా గతనెల 23న మౌనిక చనిపోయింది. జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని బాసలు చేసుకుని.. వివాహం చేసుకున్న భార్య.. ఇలా మధ్యలోనే మృతి చెందడంతో అఖిల్ మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోలేకపోయాడు. దాంతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ శనివారం మధ్యాహ్నం భార్య 21వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో పూజ పనుల్లో కుటుంబ సభ్యులు నిమగ్నమయి ఉన్నారు. పూజలో కూర్చునేందుకు అఖిల్‌ను రమ్మని పిలిచింది అతడి తల్లి. స్నానం చేసి 5 నిమిషాల్లో వస్తానని చెప్పి తన గదిలోకి వెళ్లిన అఖిల్ ఎంతకూ బయటకురాలేదు. స్నానం చేసి వస్తానని గదిలోకి వెళ్లిన కుమారుడు ఎంతకు బయటకు రాకపోవడంతో.. అఖిల్ తల్లికి అనుమానం వస్తుంది. బంధువుల సాయంతో తలుపులు తెరవగా భార్య చీరతో అఖిల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు.
వెంటనే అతడిని కిందకు దించి గాంధీ ఆసుపత్రికి వెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 21 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు చనిపోవడంతో పాపం ఆ చిన్నారులిద్దరూ అనాధలయ్యారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు వెళ్లారని తెలియక వారి కోసం ఏడుస్తున్న చిన్నారులను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటున్నారు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.