గత రెండు రోజుల కిందట మాదాపూర్ లోని దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు అతనెవరో గుర్తించారు.
హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువులో శనివారం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆనవాళ్లు కనిపించకపోవడంతో పోలీసులు వెంటనే DRF బృందానికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆ బృందం గత రెండు రోజులుగా తీవ్రంగా శ్రమించింది. ఇక ఎట్టకేలకు సోమవారం అతని మృతదేహాన్ని దుర్గం చెరువులో నుంచి బయటకు తీశారు.
ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి నేరుగా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడు సూర్యాపేటకు చెందిన వెంకట రామిరెడ్డి (31)గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎందుకు ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ చెరువులో ఇప్పటికి ఎంతో మంది దూకి ఆత్మహత్య పాల్పడ్డారు.