హైదరాబాద్ నగర శివారులోని హయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(17)పై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా విస్మయం కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చేయి. బాలికపై జరిగిన అఘాయిత్యం తీరు, ఆ ఘటన బయటకు వచ్చిన విధానం చూస్తుంటే.. బాలుర విద్యార్థుల మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉందన్నది అర్థమవుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాయత్ నగర్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాధిత బాలికతో పాటు, ఐదుగురు బాలురు పదో తరగతి చదువుతున్నారు. ఆగస్టు 15న జెండా వందనం కార్యక్రమం ముగిశాక బాలిక వాష్ రూంకి వెళ్ళింది. అదే సమయంలో ఐదుగురు బాలురు.. సదరు బాలికను ఫాలో అయ్యారు. అనంతరం లోపలకి తీసుకెళ్లి సున్నితంగా మాట్లాడుతూ అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీశారు. దీన్ని అడ్డు పెట్టుకొని ఎవరికైనా చెబితే ఈ వీడియోని అందరికి చూపించడంతో పాటు సోషల్ మీడియాలో పెడతామంటూ భయపెట్టారు. దీంతో బాలిక ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది. ఈ ఘటన జరిగిన మరో 10 రోజుల తరువాత బాలికను బెదిరించి మరోసారి బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్ళీ సెల్ ఫోన్ లో వీడియో తీశారు.
అయితే.. రెండోసారి ఐదుగురిలో ఒక బాలుడికి అవకాశం ఇవ్వలేదట. ఈ కోపంతో సదరు విద్యార్ధి వీడియోలను ఏకంగా 50 మందికి పంపాడట. అలా వైరల్ అయిన వీడియో చివరకు బాధిత తల్లిదండ్రుల ఫోన్‌కి కూడా వచ్చింది. దీంతో బాలికను తల్లి నిలదీసి అడగగా జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం స్థానిక కార్పొరేటర్ ను, పెద్దలను ఆశ్రయించినా ఫలితం దక్కకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాలికను బాలకల వసతి గృహంలో చేర్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.