ఈ కాలంలో డబ్బు సంపాదించేందుకు కొంతమంది కేటుగాళ్ళు ఎన్నో రకాల మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఫోర్జరీ సంతకాలు, స్వచ్చంద సేవా సమితి పేరిట బడా వ్యాపారులను, సెలబ్రెటీలను మోసం చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తుంటారు.
ఈ మద్యకాలంలో చాలా మంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని నమ్మించి దారుణంగా మోసాలు చేస్తు డబ్బు సంపాదిస్తున్నారు. కొంతమంది కేటుగాళ్ళు పలు స్వచ్ఛంద సంస్థల పేర్లు చెబుతూ అక్రమంగా చందాలు వసూళ్లు చేస్తుంటారు. ఫోర్జీరీ సంతకాలు, అక్రమ దందాలు, బ్లాక్ మెయిలింగ్ లాంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. తాజాగా మంత్రి హరీష్ రావు పేరుతో డబ్బులు వసూళ్లు చేసే ఇద్దరు కేటుగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
మంత్రి హరీష్ రావు పేరు తో మోసం చేయాలని చూసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బహదూర్ పల్లి దుండిగల్ కు చెందిన పేరాల వెంకటేశ్, గండిమైసమ్మకు చెందిన గడ్డమీద రాజేష్ కుమార్ స్నేహితులు. ఈ ఇద్దరూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలన్న ఆలోచనతో ఓ ప్లాన్ వేశారు. తరుచూ మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్తూ.. వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేసేవారు. ఈ క్రమంలోనే పలువురు బిల్డర్లు, వ్యాపారవేత్తలతో పరిచయం పెంచుకున్నారు. తాము హరీష్ రావు కి చాలా క్లోజ్ అని.. తమ వల్ల ఎన్నో పనులు అవుతాయని చాలా మందిని నమ్మించారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ‘హరీష్ అన్న సేవా సమితి’ పేరుతో 2016లో ఒక సంస్థను రిజిస్ట్రేషన్ (1963/2016) చేయించారు.
ఈ సంస్థకు నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత గుండాల మల్లేశ్ గౌడ్ ను ఆ సమితీ అధ్యక్షుడిగా పేరు నమోదు చేశారు. విచిత్రం ఏంటంటే ఈ విషయం మల్లేశం గౌడ్ కి కూడా తెలియదు. అంతేకాదు ‘హరీష్ అన్న సేవా సమితి’ పేరుతో ఉన్న రశీదులో మొదటి దాతగా మంత్రి హరీష్ రావు పేరుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతల, కార్యకర్తల పేర్లు ముద్రించారు. ఈ పుస్తకాలతో బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలను కలిసి డబ్బులు వసూల్లు చేస్తున్నట్లుగా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే డీసీపీ రాధాకిషన్, పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ రంగంలోకి దిగి నిందితులిద్దరినీ పట్టుకున్నారు. రశీదు బుక్కులు, 4 సెల్‌ఫోన్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం తెలిసిన గుండాల మల్లేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.