ఈ మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకుంటున్న యువత సంఖ్య పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే.. ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులు చదువు వల్ల పెరుగుతోన్న ఒత్తిడిని ఎదుర్కొలేకపోతున్నారు. ఓవైపు కాలేజీల్లో టీచర్ల వేధింపులు, మరోవైపు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నాం అనే కారణం చేత ఎందరో విద్యార్థులు.. చిన్న వయసులోనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ దారుణం మర్చిపోలేకముందే.. మరో విషాదం వెలుగు చూసింది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక.. ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానంటూ.. డిగ్రీ విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓల్డ్ విలేజ్‌లో నివాసం ఉంటున్న వన్నెల పావని (19) అనే యువతి బేగంపేట్‌లోని గర్ల్స్ డిగ్రీ ప్రభుత్వ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే గత కొంతకాలంగా.. సరిగా చదువలేకపోతున్నాను అంటూ ఆలోచిస్తూ.. డిప్రెషన్‌లోకి వెళ్లింది పావని. ఇక తాను చదువుపై శ్రద్ధ పెట్టలేనని భావించిన పావని.. దారుణ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని భావించిన పావని.. ఏకంగా తన జీవితానికే ముగింపు పలకాలని భావించింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు కుమార్తె శవం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ప్రాణంగా పెంచుకున్న బిడ్డ.. ఇలా విగతజీవిగా వేలాడటం చూసి వారు గుండెలు బాదుకున్నారు. చదువొక్కటే జీవితం కాదు కదా తల్లి.. నువ్వు మా కళ్ల ముందు ఉంటే అదే పదివేలు.. ఇంత దారుణం ఎలా చేయాలనిపించింది.. ఊరేసుకునేముందు మేం గుర్తుకు రాలేదా తల్లి.. మాకేందుకు ఇంత కడుపుకోత మిగిల్చావ్ అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. పావని ఆత్మహత్య చేసుకోవటానికి చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవటమే ప్రధాన కారణమా.. లేదా వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి విద్యార్థులు ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోవడానికి కారకులు ఎవరు విద్యా వ్యవస్థా లేర సమాజం తీరే అలా ఉందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.