వివాహానికి ముందు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడో పెళ్లి కొడుకు. దీంతో పెళ్లి కూతురు ఆ మ్యారేజ్‌ను రద్దు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
కోట్ల రూపాయల కట్నం, మంచి కుటుంబం, అందమైన అమ్మాయి.. పెళ్లి చేసుకోవడానికి వరుడికి ఇంతకంటే ఏం కావాలి. కానీ ఒక యువకుడు చేజేతులా అంతా నాశనం చేసుకున్నాడు. వివాహానికి ముందు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేగాక పెళ్లికుమార్తెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లికొడుకు ప్రవర్తన కారణంగా మ్యారేజ్ రద్దయింది. దీంతో తీసుకున్న ఆభరణాలు, పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అమ్మాయి తరఫు వారు పోలీసులకు కంప్లయింట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉండే ఓ యువతి (24) ఫ్యామిలీకి చిత్తూరులో ఉండే ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి, తేజ స్వీట్స్ అధిపతి ఎ.రవిబాబు కుటుంబంతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది.
కొడుకు వైష్ణవ్ (27)తో పెళ్లి సంబంధం ప్రతిపాదనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. పెళ్లికి రూ3 కోట్లు కట్నంగా ఇవ్వాలని.. వివాహాన్ని ఆడంబరంగా, డెస్టినేషన్ మ్యారేజ్‌లా చేయాలని వైష్ణవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో తిరుపతిలోని తాజ్ హోటల్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేశారు వైష్ణవ్ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత నవంబర్ 20న లగ్న పత్రిక రాసుకున్నారు. ఆ టైమ్‌లో రూ.6 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్, రూ.2 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచ్, రూ.2 లక్షల విలువైన ఒక బంగారు గొలుసును వైష్ణవ్‌కు పెళ్లి కూతురి కుటుంబీకులు పెట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 9న మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌లో వైష్ణవ్‌తో యువతికి పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు. అందుకు రూ.50 లక్షలు ఖర్చు చేశారు. ఫ్రిబవరి 7న సంగీత్ కార్యక్రమానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అప్పటికే వైష్ణవ్‌తో పాటు అతడి ఫ్రెండ్స్ అంతా కలసి మద్యం సేవించారు. పీకలదాకా తాగిన వైష్ణవ్.. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చోటుకు వెళ్లి కొరియోగ్రాఫర్‌తో పాటు ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన పెళ్లికూతురు వైష్ణవ్‌ను నిలదీసింది. ఇద్దరిమధ్య మాటామాటా పెరిగింది. అయితే అప్పటికి ఫ్రెండ్స్ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కానీ మరోసారి ఇలాగే గొడవ కాగా.. ఈసారి పెళ్లికూతురిపై వైష్ణవ్ దాడికి పాల్పడ్డాడు.
పెళ్లికూతురిని వైష్ణవ్ బూతులు తిట్టాడు. ఆమె కళ్లముందే మద్యం తాగడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె సోదరుడిపై దాడికి దిగాడు. దీంతో అతడ్ని పెళ్లి చేసుకోనని పెళ్లి కుమార్తె తేల్చిచెప్పింది. ఇరు వర్గాల పెద్దలు ఈ పెళ్లిని రద్దు చేశారు. అయితే వివాహం కోసం ఖర్చు చేసిన రూ.50 లక్షలు, తమకు పెట్టిన ఆభరణాలను తిరిగి ఇస్తామని చెప్పిన వైష్ణవ్ ఫ్యామిలీ ముఖం చాటేశారు. రెండు నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోగా.. ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వైష్ణవ్‌తోపాటు అతడి తండ్రి రవిబాబు, తల్లి దేవి, బంధువులు తేజు, శ్రవణ్, శరత్‌కుమార్ రెడి తదితరులపై ఐపీసీ 354, 420, 406, 506లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.