తప్పు ఎప్పటికైనా తప్పే. తప్పు చేసి దొరకమని చాలా మంది అనుకుంటారు. కానీ ఎప్పటికైనా వాళ్లు దొరికిపోతారు. ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడు తాను ఎప్పటికీ దొరకనని అనుకున్నాడు. కానీ పోలీసులు అతడి ఆట కట్టించారు.
అమాయకులే టార్గెట్‌గా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ కేటుగాడు అలాంటోడే. అతడు చదివింది పన్నెండో తరగతి. కానీ సైబర్ నేరాల్లో మాత్రం ఆరితేరాడు. అతడి మోసాల బాగోతం తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. కానీ ఎంతటి వారైనా తప్పు చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే కదా. వీడూ అలాగే దొరికిపోయాడు. హైదరాబాద్ కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న దాడి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు లక్ష్యంగా భారీ సైబర్ మోసాలకు పాల్పడేవాడు శ్రీనివాస్. తాము పోలీసు ఆఫీసర్లమంటూ స్త్రీలను బెదిరించేవాడు. వాళ్లు పంపిన కొరియర్లో డ్రగ్స్ లేదా ఆయుధాలు దొరికాయనేవాడు. ఒకవేళ కొరియర్ తమది కాదని ఆ మహిళలు నిరూపించుకోవాలంటే బ్యాంకు వివరాలు పంపాలని ఆదేశించేవాడు.
శ్రీనివాసరావు బెదిరింపులకు భయపడిన మహిళలు అతడు అడిగిన వివరాలు ఇచ్చేవారు. అతడికి ఓటీపీ లాంటి డీటెయిల్స్ కూడా చెప్పేవారు. దీంతో ఎనీ డెస్క్ లాంటి యాప్స్ ద్వారా అమాయకుల బ్యాంకు అకౌంట్స్‌ను కొల్లగొట్టేవాడు శ్రీనివాసరావు. ఇలా దేశవ్యాప్తంగా వేలాది మందిని బెదిరించేవాడు. తద్వారా రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు లావాదేవీలు జరిపేవారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. తాను దోచుకున్న డబ్బులను క్రిప్టో కరెన్సీలోకి మార్చి.. ఆ మొత్తాలను ఒక చైనా దేశీయుడి అకౌంట్‌కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి శ్రీనివాసరావుతో పాటు ముఠాలోని మరో నలుగుర్ని పోలీసులు పట్టుకున్నారు. శ్రీనివాసరావు లావాదేవీలు జరుపుతున్న 40 బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.