హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు ఓ వ్యక్తిని కొందరు దుండగులు కంట్లో కారం పోసి కత్తులతో నరికారు. ఈ దుండగుల దాడిలో ఆ వ్యక్తి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే ఆ వ్యక్తిని ఎందుకు చంపారు? ఈ ఘటనలో అసలేం జరిగిందనే మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తిలో మహమ్మద్ మొససిద్ది అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను కేఎంఆర్ ఇండియా హోమ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కేఎంఆర్ ఇండియా హోమ్స్ లో ఫ్లాట్లు దక్కించుకునేందుకు చాలా మంది మొససిద్దికి డబ్బులు చెల్లించారు. ఇదిలా ఉంటే నగరానికి చెందిన ఫైజుద్దీన్ అనే వ్యక్తి మొససిద్దికి 12 గజాల స్థలం విషయంలో రూ.50 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే మొససిద్ది.. ఫైజుద్దీన్ కి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదంగా మారింది. ఈ క్రమంలోనే ఫైజుద్దీన్ కోపంతో ఊగిపోయాడు. ఇటీవల ఫైజుద్దీన్.. నీతో మాట్లాడాలంటూ మొససిద్దిని దిల్ కుష్ నగర్ లోని తన ఇంటికి రావాలని పిలిచాడు.
దీంతో మొససిద్ది అతని ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్నారో లేదో.. ఫైజుద్దీన్ తన చేతులో ఉన్న కారాన్ని మొససిద్ది కంట్లో చల్లాడు. దీంతో అతడు వెంటనే బయటకు పరుగులు తీశాడు. అనంతరం ఫైజుద్దీన్ కత్తులతో వ్యాపారి మొససిద్దిని దారుణంగా నరికి చంపారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బోయిన్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొససిద్ది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఫైజుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.