సమాజంలో చోటు చేసుకునే సంఘటనలు చూస్తే.. ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు అనిపించక మానదు. ప్రేమలో ఉన్న వారికి.. తమ భాగస్వామి ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తారు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే యువతి కూడా అలానే ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మింది. మరి చివరకు ఏం జరిగింది అంటే..
చూడచక్కని రూపం.. అందమైన నవ్వు. ఆమెను చూడగానే ఎవరైనా అరే ఎంత అందంగా ఉంది అనుకోక మానరు. అయితే అందమైన రూపంతో పాటు అమాయకత్వం కూడా ఇచ్చాడు దేవుడు. దాంతో ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మింది. ఎంతలా అంటే.. అతడు తనను ప్రేమించి.. ఏళ్లుగా సహజీవనం చేసి.. ఇంకో మహిళను వివాహం చేసుకుని.. బిడ్డలను కన్నా కూడా అతడే తన జీవితం అనుకుంది. కానీ పెళ్లి తర్వాత ఆ వ్యక్తి తీరులో మార్పు వచ్చింది. అకారణంగా గొడవపడేవాడు.. ఇంట్లో నుంచి వెళ్లి పోవాలని వేధించేవాడు. ఆఖరికి ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశాడు. ఆ వివరాలు..
సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం.. హైదరాబాద్, బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆర్ సదానంద్ అనే వ్యక్తి బంజరాహిల్స్ రోడ్ నం.2లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఈ క్రమంలో సదానంద్‌కు అదే ప్రాంతంలో నివసించే రెడపాక పల్లవి(27)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ గత ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
సదానంద్.. పల్లవితో సహజీవనం చేస్తూనే.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. సదానంద్ వివాహం చేసుకున్నప్పటికి కూడా పల్లవి.. అతడిని విడిచి వెళ్లలేదు. సదానంద్‌కి పెళ్లి అయినా సరే.. ఆ తర్వాత కూడా అతడితో సహజీవనం కొనసాగింది. అయితే గత కొన్నిరోజులుగా సదానంద్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎలాంటి కారణం లేకుండానే పల్లవితో గొడవపడేవాడు. అకారణంగా ఆమెపై దాడికి పాల్పడుతున్నాడు. పల్లవి వీటన్నింటిని భరిస్తూ వచ్చింది.
ఈ క్రమంలో ఈనెల 22న పల్లవి, సదానంద్ మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అతడి తీరుతో విసిగిపోయిన పల్లవి.. 22వ తేదీ రాత్రి 10 గంటలకు పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తిలో నివసించే తల్లికి ఫోన్ చేసి తన బాధ చెప్పుకుంది. సదానంద్ తనను విపరీతంగా కొడుతున్నాడని.. పుట్టింటికి వెళ్లాలని.. లేదంటే చనిపోవాలని వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. పల్లవి మాటలు విన్న తల్లి.. భయపడవద్దని.. తాను వస్తున్నానని చెప్పింది. చెప్పినట్లుగానే 23వ తేదిన పల్లవి దగ్గరకు బయలు దేరింది. ఆమె హైదరాబాద్‌కు వస్తుండగానే మార్గమధ్యలో ఉండగానే.. సదానంద్, పల్లవి తల్లికి కాల్ చేసి ఆమె మరణించినట్లు తెలిపాడు.
22 రాత్రి పల్లవి ఆత్మహత్య చేసుకుంది అని తెలిపాడు. బిడ్డ చనిపోయిన విషయం తెలుసుకున్న పల్లవి తల్లి గుండె ఆగిపోయింది. కానీ సదానంద్ వేధింపుల వల్లనే తన బిడ్డ చనిపోయింది అని ఆమెకు తెలుసు. దాంతో నగరానికి చేరుకున్నపల్లవి తల్లి.. సదానంద్ మీద బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొన్నారు. మరి పల్లవి అమాయకత్వం వల్లే ఇంత దారుణం జరిగింది అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి