భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా ఆమెను చంపటానికి ప్రయత్నించాడు. కత్తితో పొడిచి గొయ్యి తీసి పాతిపెట్టాడు. అయితే, ఆమె ప్రాణాలతో బయటపడి పోలీసులను ఆశ్రయించింది. ఆ క్రూర భర్త అరెస్టయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాషింగ్టన్‌కు చెందిన 42 ఏళ్ల యంగ్ షూక్ అనే మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య భరణం విషయంలో గొడవ నడుస్తోంది. క్యోంగ్ రిటైర్‌మెంట్ డబ్బులు మొత్తం తనకు ఇవ్వాలని యంగ్ షూక్ డిమాండ్ చేస్తోంది.
అయితే, చాయ్ క్యోంగ్‌కు భార్యకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదు. అందుకే ఆమెను చంపేస్తే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నాడు. భార్యను కిడ్నాప్ చేసి హత్య చేయటానికి ప్లాన్ చేశాడు. ఆదివారం ఆమెను కిడ్నాప్ చేశాడు. చేతులు వీపు వెనకాలకు తిప్పి టేప్ వేశాడు. కళ్లకు, కాళ్లకు కూడా టేప్ చుట్టాడు. అయితే, భర్త తనను కిడ్నాప్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడని భావించిన ఆమె తన ఆపిల్ స్మార్ట్ వాచ్ ద్వారా 911కు ఫోన్ చేసింది. కూతురికి, ఫ్రెండ్స్‌కు ఎమర్జెన్సీ నోటిఫికేషన్లు పంపింది. అయితే, అది తెలుసుకున్న భర్త ఆమె స్మార్ట్ వాచ్‌ను పగులగొట్టాడు. ఆ తర్వాత ఆమెను తన కారులో పడేసి, ఊరికి దూరంగా తీసుకెళ్లాడు.
అక్కడ నేలపై ఓ అడుగు మేర గొయ్యి తవ్వాడు. తర్వాత ఆమె ఛాతిలో కత్తితో పొడిచి గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. అయితే, ఆ గొయ్యి అడుగు లోతులో ఉండటంతో యంగ్ షూక్‌కు అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. శ్వాస కూడా ఆడసాగింది. కొద్దిసేపటి తర్వాత చాయ్ క్యోంగ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. కొన్ని గంటల పాటు ఆమె ఎంతో కష్టపడి సమాధినుంచి బయటపడింది. తన కళ్లకు కట్టిన ప్లాస్టర్‌ను తీసుకుని అక్కడినుంచి పరుగులు తీసింది. అలా 30 నిమిషాల పాటు పరుగులు తీసి ఇంటికి చేరుకుంది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.