హెడ్ మాస్టర్ అంటే పాఠశాల అనబడే శరీరానికి పెద్ద తలకాయ లాంటివాడు. అలాంటి తలకాయే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తే ఆ స్కూల్ పరిస్థితి ఏంటి? హెడ్ మాస్టర్ అయి ఉండి హెడ్ లేనోడిలా ప్రవర్తించాడో స్కూల్ హెడ్ మాస్టర్. పేరు సంతోష్ కుమార్. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిపై సంతోష్ కుమార్ కన్ను పడింది. అందంగా ఉందని లొంగదీసుకుందామని అనుకున్నాడు. గత కొంత కాలంగా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అయినప్పటికీ ఆ టీచరమ్మ భరిస్తూ వచ్చారు.
హెడ్ మాస్టర్ అన్న ఒకే ఒక్క కారణంగా ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదు. అయితే రోజు రోజుకు సంతోష్ కుమార్ ఆగడాలు మితిమీరడంతో ఆమె భరించలేకపోయింది. ఆమె వాట్సాప్ నంబర్‌కి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ ఆమెను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. సంతోష్ కుమార్ అసభ్యపదజాలం ఉపయోగిస్తూ నీచమైన మెసేజ్‌లు పంపడంతో ఆమె భరించలేకపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
దీంతో ఆమె కుటుంబ సభ్యులు హెడ్ మాస్టర్ సంతోష్ కుమార్‌పై గత నెల 28న ఆందోల్ ఎంఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు సంతోష్ కుమార్‌కి ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. మరుసటి రోజు స్థానిక నాయకులతో ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి 29వ తేదీన డీఈవో రాజేష్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల విచారణలో హెడ్ మాస్టర్ తప్పు ఉందని తేలడంతో సంతోష్ కుమార్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనపై ఉపాధ్యాయురాలితో పాటు స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన సంతోష్ కుమార్‌ని కఠినంగా శిక్షించి, ఇలాంటివి పునరావృతంక కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరి టీచర్ పట్ల సభ్యకరంగా ప్రవర్తించిన ఆ హెడ్ మాస్టర్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.