ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు అభం, శుభం తెలియని మైనర్ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక తెలిసి తెలియని వయసులోనే కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లూ చేస్తూ చివరికి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆ బాలికలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని ఓ మైనర్ బాలికకు ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని నిశ్చయించారు.
అయితే మరికొన్ని గంటల్లో పెళ్లి. కానీ, ఆ బాలికకు మాత్రం ఇప్పడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ సమయంలో ఆ బాలికకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఆ బాలిక పెళ్లి బట్టల్లో ఉండగా వీడియో తీసుకుంటూ తన బాధను అంత వివరించింది. అందులో ఏముందంటే?.. నా పేరు (…). నాకు 17 ఏళ్లు. నేను ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు నాకు ఇష్టం లేకున్నా.. 30 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు. నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. దయచేసి నన్ను కాపాడండి అంటూ ఏడుస్తూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక అదే వీడియోను చివరికి వాట్సాప్ ద్వారా పోలీసులకు పంపింది.
ఈ వీడియోను చూసిన పోలీసులు వెంటనే హయాత్ నగర్ పోలీసలుకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన హయత్ నగర్ పోలీసులు ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను స్టేషన్ కు పలిపించి వారికి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత పోలీసులు ఆ బాలికను వనస్థలిపురం సఖీ సెంటర్ కు పంపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఇలా మైనర్ బాలికలకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న ఇలాంటి ఘటనలపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.