ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలకు అంతు పొంతు లేకుండా పోతుంది. ప్రేమ మైకంలో ఉన్మాదులుగా మారి.. దారుణాలకు ఒడి గడుతున్నారు. యువతులు కూడా హత్యలు చేస్తుండటం గమనార్హం. తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
గతంలో తెలంగాణలో స్వాతి కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రియుడితో కలిసి ఉండేందుకు.. భర్తను చంపి.. ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేపించి.. ఆ స్థానంలో అతడిని తీసుకురావాలని మాస్టార్ ప్లాన్ వేసింది. ఓ టీవీ సీరియల్ ఆధారంగా స్వాతి ఇలా పథకం రచించింది. కానీ ఆఖరి నిమిషంలో అది రివర్స్ అయ్యి.. స్వాతి ఖతర్నాక్ వ్యవహారం గురించి పోలీసులకు తెలిసింది. దాంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇక తాజాగా ఇదే కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. ప్రేమించిన వాడిని వివాహం చేసుకోవడం కోసం ఓ యువతి.. అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తన ప్రేమను బతికించుకోవడం కోసం మరో నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి మాస్టర్ ప్లాన్ చూసి పోలీసులే నివ్వెర పోతున్నారు. ఈ ప్లాన్‌కు ఆధారం కూడా ఓ టీవీ సీరియలే కావడం గమనార్హం. ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.
హరియాణా రాష్ట్రంలోని పానీపత్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్న ప్రియురాలు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఐదేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ దారుణంలో తాజాగా ప్రియురాలికి శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితురాలు జ్యోతి, కృష్ణ కాలేజీలో చదివే రోజుల నుంచే ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి జ్యోతి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. దాంతో లవర్స్ ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు.. ఇంటి నుంచి వెళ్లిపోయినా సరే వదలరు. తమ కోసం వెతుకుతారు. తిరిగి ఇంటికి తీసుకువస్తారు అని భావించిన జ్యోతి.. అత్యంత దారుణ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో తాను ఇంట్లో నుంచి వెళ్లినా సరే.. కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. జ్యోతిలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని ప్రేమికులిద్దరూ నిర్ణయించుకున్నారు. ఓ టీవీ సీరియల్ ఆధారంగా ఈ పథకం రచించారు. దీని ప్రకారం 2017 సెప్టెంబర్ 5న.. జ్యోతి తన స్నేహితురాలు సిమ్రన్‌ను జీటీ రోడ్డుకు పిలిపించింది. కాసేపు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత… జ్యోతి.. తన స్నేహితురాలు సిమ్రన్ చేత మత్తు కలిపిన కూల్‌డ్రింక్ తాగించింది. స్పృహ తప్పి కింద పడిపోయిన తర్వాత.. జ్యోతి, ఆమె లవర్ ఇద్దరూ కలిసి సిమ్రన్ గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత మృతురాలి దుస్తులు మార్చి, ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి ప్రేమికులిద్దరూ అక్కడ నుంచి ఉడాయించారు.
పోలీసులు చూపిన సిమ్రన్ మృతదేహం జ్యోతిదే అని భావించిన కుటుంబసభ్యులు తమ కుమార్తె మృతి చెందింది అని భావించి.. సిమ్రన్ డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. సిమ్రన్ కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిమ్రన్ మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. జ్యోతిగా భావించిన యువతి డెబ్ బాడీకి సంబంధించిన ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు చూపించారు. ఈ క్రమంలో డెడ్ బాడీ మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా అది సిమ్రన్ అని గుర్తించారు.
అనుమానం వచ్చిన పోలీసులు జ్యోతి తల్లిదండ్రులను ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో జ్యోతి, కృష్ణలను వెదికే పనిలో పడ్డ పోలీసులు శిమ్లాలో వారిని గుర్తించి, 2020లో అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగా క్షయవ్యాధితో కృష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనపై మంగళవారం తీర్పు చెప్పిన పానిపత్ కోర్టు.. జ్యోతికి జీవితఖైదు విధించింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.