Suit Case Crime News: ఓ ప్రధాన రహదారి పక్కన ఓ సూట్ కేస్ కలకలం సృష్టించింది. కొన్ని గంటల పాటు స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది. పోలీసులు వచ్చి సూట్ కేస్ తెరవగా.. నిర్ఘాంతపోయే దృశ్యం కనిపించింది. అందులో ఓ యువతి శవం వెలుగు చూసింది. ఈ సంఘటన హర్యానాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానాలోని గురుగ్రామ్, ఇఫ్‌కో చౌక్ దగ్గరలోని ఓ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ సూట్ కేస్ కనిపించింది. కుక్కలు పదే పదే ఆ సూట్ కేసు దగ్గరకు వచ్చి, చుట్టూ తిరుగుతూ.. వాసన చూసి అరవటం మొదలుపెట్టాయి.
దీంతో అటుగా వెళుతున్న జనం దృష్టి ఆ సూట్ కేసుపై పడింది. ఆ సూట్ కేసులో ఏముందో అర్థంకాక జనం భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. పోలీసులతో పాటు యాంటీ బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అందులో పేలుడు వస్తువులు ఉండే అవకాశం ఉందని భావించి దాన్ని అక్కడినుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. ఓ చోట సూట్ కేసును అత్యంత జాగ్రత్తగా తెరిచారు. లోపల ఉన్న దాన్ని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సూట్ కేస్‌లో ఓ అమ్మాయి నగ్న శవం బయటపడింది.
యువతి శవంతో పాటు కొన్ని దుస్తులు కూడా లోపల కనిపించాయి. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ఎవరు? అన్నదానిపై విచారణ చేపట్టారు. హంతకులు ఆ యువతిని వేరే చోట చంపేసి ఉంటారని, ఆ తర్వాత శవాన్ని సూట్ కేస్‌లో కుక్కి ఇఫ్‌కో చౌక్ రోడ్డుపక్క పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. యువతికి 30 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.