ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మారిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా నేటి కాలంలో సైబర్ నేరాలు కూడా మరింత ఎక్కువైపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ గొర్రెల కాపరిని మోసం చేసిన కొందరు దొంగలు.. ఏకంగా 50 గొర్రెలను చోరీ చేశారు. స్థానికంగా ఇప్పుడు ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? 50 గొర్రెలను ఒకేసారి ఎలా తీసుకెళ్లారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి. ఇదే గ్రామంలో కృష్ణారావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు గత 4 ఏళ్ల నుంచి గొర్రెలను మేపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే కృష్ణారావు ఎప్పటిలాగే ఇటీవల ఓ రోజు 50 గొర్రెలను తీసుకుని మేపడానికి గ్రామ సమీపంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లాడు. ఇక మధ్యాహ్నం వరకు కృష్ణారావు గొర్రెలను మేపుతూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆ గొర్రెల కాపరిని గమనించారు. ఎలాగైన అతడికి తెలియకుండా ఆ గొర్రెల మందను చోరీ చేయాలని భావించారు. అయితే వీరి ప్లాన్ లో భాగంగానే ఆ నలుగురు యువకులు దొంగచాటున ఆ గొర్రెల కాపరి వద్దకు వెళ్లారు.
వెంటనే అతడి ముఖానికి ముసుగు కప్పి, అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత టేపుతో అతని కాళ్లు, చేతులు కట్టేశారు. ఇక అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్న వెంటనే.. ఆ నలుగురు యువకులు ఆ 50 గొర్రెలను తోలుకుని వెళ్లారు. అయితే గొర్రెలతో పాటు అడవికి వెళ్లిన కృష్ణారావు ..సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ కృష్ణారావు కుటుంబ సభ్యులు అడివిలోకి వెళ్లి అంతటా గాలించారు. ఓ చోట కృష్ణారావు స్పృహ కోల్పోయి కిందపడి కనిపించాడు.
వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం బాధితుడు తేలుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరో గుర్తు తెలియని నలుగురు యువకులు నాకు ఇంజక్షన్ ఇచ్చారని, ఆ తర్వాత నా కాళ్లు, చేతులు కట్టేసి గొర్రెలను తీసుకెళ్లిపోయారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ గొర్రెల చోరీ ఘటనపై మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి.