సాధారణంగా భారీ వర్షాలు పడితే పురాతన భవనాలు, నిర్మాణాలు కుప్పకూలిపోతుంటాయి. కొన్నిసార్లు పాత గోడలు, భవనాలు కూలి చనిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని అంటుంటారు. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రస్తుతం గుజరాత్ లో భారీగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా పాత భవనాలు, నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని హలోల్‌లోని పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి నలుగురు చిన్నారు మరణించారు. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఓ పాత గోడ కూలి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లపై పడి ఐదేళ్ల లోపు ఉన్న నలుగురు చిన్నారులు కన్నుమూశారు.. మరో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులు మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన చిరిరామ్ దామోర్ (5), అభిషేక్ భూఏరియా ( 4), గున్‌గున్ భూరియా ( 2) ముస్కన్ భూరియా (5)గా గుర్తించారు. హలోల్ తాలూకా చంద్రపురి గ్రామంలో ఓ రసాయన ఫ్యాక్టరీ సమీపంలో నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ పనిచేయడానికి బాధిత చిన్నారుల కుటుంబీకులు వచ్చి ఫ్యాక్టరీ పక్కన తాత్కాలికంగా టెంట్లతో గూఢారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన గురించి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాంశు సోలంకి మాట్లాడుతూ.. గుజరాత్ లో గత 36 గంటల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు పాత భవనాలు కూలిపోతున్నాయి.. ఈ క్రమంలోనే మూసి ఉన్న ఫ్యాక్టీరీ ప్రహారీ గోడకు ఆనుకొని బాధిత కుటుంబ సభ్యులు తాత్కాలికంగా శిభిరాలను ఏర్పాటు చేసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రహారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయి టెంట్లపై పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు చనిపోగా.. గాయపడిన పిల్లలను హలోల్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇదిలా ఉంటే.. వల్సాద్ జిల్లా పర్డీ తాలూకా లో గత 36 గంటల్లో 183 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రానున్న రెండు రోజులు భారీగా వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది.