భారత దేశంలో గత కొంత కాలంగా డ్రగ్స్ కలకలం ఏ రేంజ్ లో కొనసాతుందో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లో డ్రగ్స్ కేసుల విషయంలో సినీ ప్రముఖులను ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి బడా బాబుల వరకు డ్రగ్స్ కి అలవాటు పడటంతో కేటుగాళ్లు ఈ దందాని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. అయితే డ్రగ్స్ మాఫియా కొత్త రూట్లు వెతుకుతోంది. విమానాల ద్వారా, మనుషుల ద్వారా మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంది. సముద్ర మార్గాల్లోనూ డ్రగ్స్‌ను దేశాలు దాటించేస్తోంది.
తాజాగా గుజరాత్ లో భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. ఈ ముఠాకు ఏపీలోని విజయవాడతో సంబంధం ఉన్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించారు. డీఆర్ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న రెండు కంటెయినర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది. ఈ దాడిలో 2వేల 988 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఈ స్థాయిలో హెరాయిన్ పట్టుబడింది బహుశా ప్రపంచంలో ఇక్కడే అంటున్నారు అధికారులు. టాల్కం పౌడర్ పేరుతో మత్తు మందులను దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, గాంధీ నగర్‌తోపాటు మాండ్విలో సోదాలు నిర్వహించారు. పలువురిని విచారించారు.
ఈ డ్రగ్స్ రాకెట్లో అఫ్ఘాన్ వాసుల ప్రమేయం కూడా ఉన్నట్టు వెల్లడింది. డీఆర్‌ఐ తనఖీలు నిర్వహించిన కంటైనర్లు అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ మాటున వచ్చిన ఈ డ్రగ్స్.. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళ్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ హెరాయిన్‌ను ఎవరు పంపారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కంటైనర్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం అధికారులు సరుకును స్వాధీనం చేసుకున్నారు.