నిజామాబాద్ జిల్లా నవీపేట ప్రాంతంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో కాబోయే భర్త పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని వేధించిన కారణంగానే నవ వధువు రవళి ఆత్మహత్య చేసుకుందని ఆ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా కాబోయే భర్త అదనపు కట్నం కూడా డిమాండ్ చేసినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా నవ వధువు ఆత్మహత్య ఘటనపై తాజాగా వరుడు సంతోష్ స్పందించాడు. ఆమె ఆత్మహత్య ఘటనపై వరుడు ఎలా స్పందించాడు? అతడు చెప్పిన నిజాలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్లారితే పెళ్లి అనగా నవ వధువు రవళి ఇంట్లోని స్టోర్ రూమ్ లోకి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ ఘటనలో పోలీసులు స్పందించి నవ వరుడు సంతోష్ అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా నవ వధువు ఆత్మహత్య ఘటనపై వరుడు సంతోష్ స్పందించి.. పెళ్లికి ముందు రోజు రాత్రి నేను రవళితో మాట్లాడింది నిజమేనని అన్నాడు. ఇక పెళ్లి తర్వాత జాబ్ చేయాలని చెప్పింది కూడా నిజమేనని, దానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుందని వరుడు సంతోష్ చెప్పుకొచ్చారు. ఇక నాతో రాత్రి ఆ అమ్మాయి బాగానే మాట్లాడిందని, తెల్లారేసరికి రవళి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదని నవ వరుడు సంతోష్ తెలిపారు.
ఇక ఆత్మహత్య తర్వాత రవళి కుటుంబ సభ్యులు నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, అదనపు కట్నం తేవాలని నేనేం డిమాండ్ చేయలేదని అన్నారు. ఇటీవల వాళ్లు ఇచ్చిన డబ్బులు మాత్రం తీసుకున్నానని తెలిపారు. అసలు రవళి ఆత్మహత్య చేసుకుంటుందని నేను ఊహించలేదని సంతోష్ తెలిపారు. ఇక ఈ ఘటనలో నేనే ఏ విచారణకైనా సిద్దమేనని వరుడు సంతోష్ అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఈ ఘటనపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.