ఆడవాళ్ల జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాళ్ల శరీరంతో కూడా వాళ్లు పోరాటం చేస్తుంటారు. నెల నెలా వచ్చే నెలసరితో వారు అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. కానీ, ఆ పిరియడ్స్ వల్ల ప్రాణం పోతుందని ఎవరూ ఊహించరు. కానీ, ఓ బాలిక పిరియడ్స్ వల్ల ప్రాణం కోల్పోయింది.
మహిళ జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. మరెన్నో అడ్డంకులు ఉంటాయి. కొందరికైతే పుట్టిన దగ్గరి నుంచి నిత్యం ఒక పోరాటంలాగనే ఉంటుంది. పైగా శారీరకంగానూ వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నెలసరి. సాధారణంగా పిరియడ్స్ సమయంలో ఎంత ఇబ్బందిగా ఉంటుంది, వాళ్లు ఎంత బాధను అనుభవిస్తారో అందరికీ తెలుసు. అయితే పిరియడ్స్ వల్ల ప్రాణం పోతుందని ఎవరూ అనుకోరు. కానీ, ఒక అభం శుభం తెలియని బాలిక ప్రాణం పోయింది. పిరియడ్స్ రావడమే ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. నెలసరి వల్లే ఆ బాలిక ప్రాణం పోయింది.
ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాష్ట్రం థానే డిస్ట్రిక్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. థానే సిటీకి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్హస్ నగర్ లో 30 ఏళ్ల వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు తన 12 ఏళ్ల చెల్లి, అత్తతో కలిసి ఉల్హస్ నగర్ లో నివాసముంటున్నాడు. ఒకరోజు చెల్లి దుస్తులకు రక్తం మరకలు చూశాడు. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తన చెల్లి ఎవరితోనే శారీరక సంబంధం పెట్టుకుందని భావించాడు. కొన్ని రోజులు గమనించిన తర్వాత ఆమెను నేరుగా ప్రశ్నించాడు. తన శరీరంలో వచ్చిన మార్పులు, తాను ఉన్న పరిస్థితిని ఆ బాలిక తన అన్నకు వివరించలేకపోయింది. అక్కడితో అతని అనుమానం మరింత పెరిగింది.
నిజానికి అలా ఎందుకు జరుగుతుందో చెప్పాలి అనుకున్నా ఆమెకు తెలియని పరిస్థితి. ఆ తెలియని తనంలోనే అన్నకు సమాధానం చెప్పలేదు. ఆమె మౌనాన్ని అన్న తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆమెను అతి కిరాతకంగా కొట్టాడు. ఆమె ఒంటిపై కాల్చిన గాయాలు ఉన్నాయి. ఆమె ముఖం, పెదాలపై వాతలు పెట్టినట్లు గాయాలు ఉండటాన్ని గుర్తించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అనుమానంతో అభం శుభం తెలియని చెల్లిని హత్య చేసిన ఆ అన్నకు ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.