దొంగతనం కోసమని వెళ్లి చంపేసి వారి ఒంటి మీద, ఇంట్లో ఉన్న నగలను ఎత్తుకొచ్చే బ్యాచ్ అది. మొత్తం ఆరుగురు దుర్మార్గులు. డబ్బుల కోసం, బంగారు నగల కోసం మనుషులను చంపేసే బ్యాచ్. ఈ బ్యాచ్ ఇప్పటివరకూ ఆరుగురిని హత్య చేశారు. కానీ ఇప్పటి వరకూ ఒక్కరు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు. అలా అని వీళ్ళేమైనా సినిమాల్లో చూపించే బజారు రౌడీలేమీ కాదు. అసలు వీరి గురించి ఎవరికీ తెలియదు. మరి ఫిర్యాదు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?
చెడు వ్యసనాలకు బానిసైన ఈ బ్యాచ్ బంగారం కోసం, డబ్బు కోసం ఎంతకైనా తెగించేవారు. విజయవాడలోని పోరంకి ప్రాంతానికి చెందిన సుంకర గోపీరాజు, ప్రభు కుమార్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. అయితే ఇలా ఎన్నాళ్ళు కష్టపడడం అని చెప్పి సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే దొంగతనాలు చేయడం. వీరి టీంలో చక్రి, దుర్గారావు, ఫణింద్ర అనే ముగ్గురు యువకులను చేర్చుకున్నారు. గోపీ ఆటోలో పగటిపూట కూరగాయలు అమ్ముతూ రెక్కీ నిర్వహించేవాడు. ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి స్పాట్ పెట్టేవాడు. చీకటి పడ్డాక ఐదుగురూ కలిసి దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో అనుమానం రాకుండా హత్య చేసి టార్గెట్ పూర్తి చేసుకునేవారు.
కరోనా సమయం వీరి పాలిట వరంగా మారింది. ఆ సమయంలో వృద్ధ మహిళలు చనిపోయినా అనుమానం రాదని, సహజ మరణంగా భావిస్తారని చావు తెలివితేటలు ఉపయోగించారు. రెక్కీ నిర్వహించిన ఇళ్లలో దూరి.. ఇంట్లో ఉన్న వృద్ధ మహిళను దుప్పటితో లేదా తలగడతో ముఖంపై నొక్కి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపుతారు. ఆ తర్వాత వారి ఒంటి మీద, ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు పట్టుకుని వెళ్ళిపోయేవారు. ఇలా చంపిన ఆరుగురు మృతుల బాధితులు సహజ మరణమనే అనుకున్నారు. అందుకే అనుమానం రాలేదు. ఫిర్యాదు ఇవ్వలేదు. కానీ డబ్బు, బంగారం పోయిందని బాధితులకు ఎందుకు అనుమానం రాలేదు అన్నది అర్థం కాని ప్రశ్న.
సరే ఈ సంగతటుంచితే.. నూరు గుడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు నేల కూలినట్టు.. ఒకే ఒక్క ఏటీఎం దొంగతనంతో వీరి హత్యలు బయటపడ్డాయి. గత ఏడాది పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంలో దొంగతనం చేసేందుకు యత్నించిన కేసులో ఈ ఐదుగురు పోలీసులకు పట్టుబడ్డారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా వీళ్లు చేసిన హత్యలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. అప్పటికే కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో చంపేందుకు రెక్కీ నిర్వహించారు. కరెక్ట్ గా స్పాట్ పెట్టే లోపు పోలీసులకు దొరికిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఉండడం ఎంత మంచిదైందో చూశారా. అదే లేకపోతే వీళ్ళు ఇంకా ఎంతమందిని చంపేవారో. అందరూ 22 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే. ఈజీ మనీ కోసం ఇలా దొంగతనాలకు, హత్యలకు పాల్పడుతూ వచ్చారు. ఎట్టకేలకు వీళ్లకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. మరి ఈ దుర్మార్గులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.