సైబర నేరాల గురించి జనాల్లో అవగాహన పెంచుతున్న కొద్ది.. మోసగాళ్లు.. కొత్త తరహా మార్గాలను ఎంచుకుని.. మరీ జనాలను మోసం చేస్తున్నారు తాజాగా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా కోటి రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. ఆ వివరాలు..
ప్రస్తుతం కాలంలో చేతిలో డబ్బులు పట్టుకు తిరగడం చాలా అరుదుగా మారింది. పెద్ద పెద్ద మాల్స్ సహా ఆఖరికి కిరాణ దుకాణాలు, రోడ్ సైడ్ షాపింగ్ ఇలా ప్రతి చోటా డిజిటల్ పేమెంట్ విధానం అమల్లోకి రావడంతో.. చేతిలో డబ్బులు తీసుకెళ్లడం తగ్గిపోయింది. ఫోన్ ఉందా.. దానిలో యూపీఐ యాప్‌లు ఉన్నాయా.. చాలు.. ఎంతయినా ఖర్చు చేసుకోవచ్చు. కరోనా తర్వాత దేశంలో డిజిటిల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. అయితే ఇండియా డిజిటలైజేషన్ దిశగా దూసుకెళ్తూంటే.. మరో వైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా.. సైబర్ నేరగాళ్లు.. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోవడం కూడా కష్టంగానే మారుతోంది. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు అధికారులు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఫోన్‌పే, గూగుల్ పే వాడే వారిని టార్గెట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే 81 మంది బ్యాంక్ ఖాతాల నుంచి ఏకంగా కోటి రూపాయలు కొట్టేశారు. ఆ వివరాలు..
సైబర్ నేరగాళ్లు.. తాజాగా ముంబైకి చెందిన 81 మందిని మోసం చేసి.. కోటి రూపాయలు కాజేశారు. బ్యాంక్ కేవైసీ, పాన్ స్కామ్ ద్వారా వివరాలు రాబట్టి.. హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. మరి కేవైసీ వివరాలు ఎలా తెలుసుకున్నారు అంటే.. సింపుల్.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా. అదేంటి.. వీటి ద్వారా కేవైసీ వివరాలు ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారా.. అదే మరీ నయా దందా. గూగుల్ పే, ఫోన్ పే గేట్ వే ద్వారా సరికొత్త మోసానికి తెర తీశారు మోసగాళ్లు. ఇందుకు వారు భారీగా ఏం కష్టపడలేదు. చాలా సింపుల్‌గా మోసం చేశారు.
ముందుగా ఈ సైబర్ నేరగాళ్లు.. ఫోన్ పే, గూగుల్ పే గేట్ వేను ఉపయోగించి.. వారు ఎంచుకున్న యూజర్ల అకౌంట్‌కు కొంత డబ్బులు పంపిస్తారు. ఆ తర్వాత ఏం తెలియనట్లు.. డబ్బులు పంపిన వారి నంబర్‌కు కాల్ చేసి పొరపాటున మీ ఖాతాకు డబ్బులు పంపాం. వాటిని తిరిగి తమ నంబర్‌కు పంపమని రిక్వెస్ట్ చేస్తారు. నిజమే అనుకుని మనం జాలి పడి డబ్బులు పంపామో.. ఇక అంతే సంగతులు. ఈ ఒక్క చిన్న పొరపాటుతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.
పాపం మన అకౌంట్‌కు డబ్బులు పంపారని జాలి పడి తిరిగి వారి ఖాతాకు పంపామో.. వెంటనే మన బ్యాంక్ ఖాతా మాల్‌వేర్ అటాక్‌కు గురవుతుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన క్రైం ఎక్స్‌పర్ట్ పవన్ దుగ్గల్ మాట్లాడుతూ.. ‘‘ఇది మాల్వేర్ ప్లస్ హ్యూమన్ ఇంజనీరింగ్ స్కాం. సైబర్ నేరగాళ్లు.. ఫోన్ పే, గూగుల్ పే యూజర్లే టార్గెట్‌గా చేసుకుని.. కావాలని మీ ఖాతాకు డబ్బులు సెండ్ చేస్తారు. ఆ తర్వాత పొరపాటున మనీ పంపాం.. తిరిగి పంపండి అని కాల్ చేయడం, మెసేజ్ చేయడం చేస్తారు. ఇలాంటి వారిని నమ్మొద్దు. పాపం అని జాలి పడి డబ్బులు పంపితే.. మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వడం ఖాయం. మీరు కనక డబ్బులు పంపితే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు మొత్తం కేటుగాళ్ల చేతికి చేరతాయి’’ అని చెప్పుకొచ్చారు.
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో ఈ సందర్భంగా వివరించారు పవన్ దుగ్గర్. ‘‘మీకు ఇలా ఎవరైనా కాల్ చేసి.. మీ అకౌంట్‌కు డబ్బులు పంపాం అని చెబితే.. మీరు స్పందించకండి. మాకు సంబంధం లేదు.. బ్యాంక్ ఆ ప్రాబ్లంను చూసుకుంటుంది అని చెప్పండి. లేదంటే మీకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు దగ్గరకు వచ్చి.. డబ్బులు తీసుకోమని సూచించండి. అప్పుడు మీకు డబ్బులు పంపిన వాళ్లు.. నిజమైన వాళ్ల లేక.. మోసగాళ్ల తెలిసిపోతుంది’’ అన్నారు. మరి సైబర్ నేరాల పెరుగుదలకు కారణాలు ఏంటి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.