నిజాయితీగా బతకడం చేతకాని వాళ్ళు మోసాలు చేసి బతకాలని అనుకుంటారు. దీని కోసం నకిలీ బతుకు బతుకుతారు. డబ్బు ఎలా సంపాదించాలో తెలిసినవాడు కష్టపడతాడు. ఈజీగా ఎలా సంపాదించాలా అని అనుకునేవాడు ఇదిగో ఇలానే మోసాలకు పాల్పడతారు. కానీ చివరకి చట్టం అనేది ఒకటి ఉంటుంది. దాన్నుండి ఎవరూ తప్పించుకోలేరు. డబ్బు సంపాదించడం ఎలాగో యూట్యూబ్ లో వీడియోలు చేసి మరీ బ్యాంకులను మోసం చేశాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ తండాకు చెందిన బోడ శ్రీకాంత్ అనే వ్యక్తి కూకట్ పల్లిలో ప్రగతినగర్ లో నివాసం ఉంటున్నాడు. డిప్లోమా చేసిన శ్రీకాంత్.. సులువుగా డబ్బు సంపాదించడం కోసం బ్యాంకుల్ని బోల్తా కొట్టించాలనుకున్నాడు.
దీని కోసం ‘లివింగ్ ఇంటీరియర్ డిజైనర్స్’ పేరుతో మేడిపల్లి సత్యనారాయణపురంలో ఒక ఫేక్ కంపెనీని సృష్టించాడు. తన ఊరి దగ్గర ఉంటున్న బానోత్ సుమన్, యడ్ల భిక్షపతికి బ్యాంకు లోన్ ఇప్పిస్తానంటూ వారికి ఆధార్ కార్డుల ద్వారా పాన్ కార్డులు చేయించాడు. ఆ తర్వాత బానోత్ సుమన్, యడ్ల భిక్షపతిని యజమానులుగా ఆ నకిలీ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇక తన గ్రామానికి దగ్గరలో ఉన్న కొందరు యువకులకు, గృహిణులకు తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 53 మంది దగ్గర ఆధార్ కార్డులు సేకరించాడు.
వీరంతా తన కంపెనీలో ఉద్యోగులు అని చెప్పి హబ్సిగూడ, ఉప్పల్, రామాంతపూర్ ఏరియాల్లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బందిని నమ్మించి సేలరీ అకౌంట్లు తెరిచాడు. ఒక్కో అకౌంట్ కి ఒక నంబర్ రిజిస్టర్ చేయించి.. ఆ సిమ్ కార్డును తన దగ్గరే ఉంచుకున్నాడు. క్రెడిట్ కార్డుకి అప్లై చేసినప్పుడు వచ్చే ఓటీపీలు, బ్యాంకు సంబంధిత మెసేజ్ ల కోసం ఆ సిమ్ కార్డుని అతని దగ్గరే ఉంచుకునేవాడు. ప్రతి నెలా ఒక పలానా తేదీన 53 మంది అకౌంట్లలో లక్ష నుంచి రూ. 2 లక్షలు వేసి తర్వాత రోజు విత్ డ్రా చేసేవాడు.
సేలరీ క్రెడిట్ అవుతున్నట్టు బ్యాంకు స్టేట్మెంట్లు, పే స్లిప్ లు చూపించి వీరి పేరు మీద క్రెడిట్ కార్డులకి అప్లై చేసాడు. ఆ తర్వాత సేలరీ పెరిగిందని చూపిస్తూ.. క్రెడిట్ కార్డు లిమిట్ ని పెంచేలా చేసుకున్నాడు. ఇలా 34 మంది క్రెడిట్ కార్డులకు బ్యాంకు పెంచిన లిమిట్ అక్షరాల రూ. 1,33,65,000. ఒక్కో కార్డు నుండి రూ. 10 లక్షలు విత్ డ్రా చేసి.. రూ. 40 లక్షలు విలువ చేసే ఇంటిని, లక్షలు విలువ చేసే ఫోర్డ్ ఎండీవర్, ఫోక్స్ వ్యాగన్ కార్లు కొన్నాడు.
ఇలా జల్సాలకు అలవాటుపడ్డ శ్రీకాంత్.. క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టకుండా రెండేళ్లు తప్పించుకుంటూ తిరిగాడు. దీంతో హబ్సిగూడ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ సుంకర శ్యామ్ జూలై 24న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు, నాచారం పోలీసులు నిందితులను వేగంగా గుర్తించారు. అయితే నిందితుడు అప్పటికే మరో రెండు బ్యాంకులను బురిడీ కొట్టించినట్లు పోలీసులు తెలిపారు.
నారపల్లిలో ‘ఎల్లో లాంప్ ఇంటీరియర్ డిజైనర్స్’, మణికొండలో ‘బ్రిక్ రాక్ అండ్ ఇంటీరియర్స్’ పేరుతొ నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంకులను కూడా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో ఎస్వోటీ, నాచారం పోలీసులు ప్రధాన నిందితుడైన బోడ శ్రీకాంత్ ను, అతనికి సహకరించిన బానోత్ సుమన్, భూక్యా నగేష్, గుడ్డేటి గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో మరో నిందితుడు యడ్ల భిక్షపతి మరణించాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఫోక్స్ వ్యాగన్ కారు, 3 క్రెడిట్ కార్డులు, 93 డెబిట్ కార్డులు, 64 ఆధార్ కార్డులు, 28 పాన్ కార్డులు, 17 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరి బ్యాంకులనే బురిడీ కొట్టించి చివరికి పట్టుబడ్డ ఈ బ్లఫ్ మాస్టర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.