ప్రతి ఒక్కరికి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. దీని కోసం కొందరు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. మరికొందరు మాత్రం అడ్డదారుల్లో డబ్బులు సంపాదింస్తుంటారు. ఈ అక్రమార్కుల్లో కొందరు ఎప్పటికప్పుడు తమ ప్రణాళికలను మారుస్తూ ఎవరికి దొరకుండా తప్పించుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వాళ్లు.. కేటుగాళ్లకే కేటుగాళ్లు. వీరి గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. శస్త్రచికిత్సల ద్వారా వేలిముద్రలనే మార్చేసి.. కువైట్ నుంచి తిరస్కరించబడిన వలస కార్మికులను అక్రమంగా తిరిగి ఆ దేశం పంపుతున్నారు ఈ కేటుగాళ్లు. ఈ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కడప జిల్లా సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన నాగమునేశ్వర్‌రెడ్డి తిరుపతిలో కృష్ణా డయాగ్నస్టిక్స్‌లో పనిచేస్తున్నాడు. అతడికి ఓ రోజు కువైట్ లో నిర్మాణ కార్మికుడు పనిచేసిన వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వీసా గడువు ముగిశాక తాను కువైట్‌లో ఉండటంతో ఆ దేశ అధికారులు తిప్పి పంపారని.. చేసేది లేక ఇండియాకు వచ్చాని తెలిపాడు. అనంతరం శ్రీలంకకు వెళ్లి మ్యూటిలేటెడ్ ఫింగ్ ప్రింట్స్ సర్జరీ చేయించుకొని మళ్లీ కువైట్ కు వెళ్లినట్లు ఆ కార్మికుడు నాగమునేశ్వర్ రెడ్డికి వివరించాడు.ఈ ఆపరేషన్ ద్వారా వేలిముద్రలు తాత్కాలికంగా మారుతాయని ఆ కార్మికుడు తెలిపాడు.
అతడు చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయిన మునేశ్వర్… కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వారికి అలాంటి వేలిముద్రల సర్జరీలు చేసి..డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని అతడికి తెలిసిన అనస్తీషియా నిపుణుడు వెంకట రమణకు తెలపగా అతడు అంగీకరించాడు. కువైట్ లోని తన స్నేహితుడి ద్వారా మునేశ్వర్ రెడ్డికి ఆ దేశం నుంచి బహిష్కరణకు గురైన రాజస్థాన్ కి చెందిన ఇద్దరు కార్మికులతో పరిచయం ఏర్పడింది. వారిని తిరిగి కువైట్ పంపిస్తామని నమ్మించారు. వారి నుంచి రూ.25 వేల చొప్పున వసూలు శస్త్ర చికిత్స చేశారు. ఈ పరిచయాలతో కేరళలో ఆరుగురికి ఈ సర్జరీ చేశారు. వారి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశారు.
ఆ తర్వాత కడప జిల్లా జ్యోతి గ్రామానికి చెందిన బి. శివశంకర్‌రెడ్డి, ఆర్.రామకృష్ణారెడ్డి లతోపాటు మరో వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఇక ఈ శస్త్ర చికిత్స ఎలా చేశారంటే.. చేతివేళ్ల చివర్ల చర్మంపై పొరను కత్తిరించి కణజాలంలోని కొంత పార్ట్ ను తీసేస్తారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన కిట్ ను ఉపయోగించి ఆ వేళ్లకి కుట్లు వేస్తారు. ఒకటి, రెండు నెలలకు వేలిముద్రల నమూనాలలో స్వల్ప మార్పులు వస్తాయి. ఇలా వచ్చిన కొత్త వేలి ముద్రలు ఏడాది పాటు ఉంటాయి. ఆ తర్వాత యథాస్థితికి వచ్చేస్తాయి. ఈలోగా కొత్తగా ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, ఇతరత్రా గుర్తింపు కార్డులను కేటుగాళ్లు పొందుతున్నారు.
ఇప్పటి వరకు ఈ ముఠా 11 మంది కువైట్ అక్రమ వలసదారులకు ఈ చికిత్స చేసింది. వీరిలో కొందరిని నకిలీ పాస్ పోర్టు, వీసాలతో కువైట్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అదును కోసం ఎదురు చూస్తున్న పోలీసులకు ఈ ముఠా కొందరు హైదరాబాదీలకు సర్జరీ చేయడానికి సిటీకి వచ్చినట్లు సమాచారం అందింది.నిందితులు బస చేసిన లాడ్జీపై ఆకస్మిక దాడులు చేసి మునేశ్వర్‌రెడ్డి, వెంకటరమణ, శివశంకర్, కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో 9 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని సీపీ తెలిపారు. వీరి నుంచి పలు రకాల పత్రాలు, సర్జరీ కిట్టును పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.