ప్రేమ.. ఈ బంధంతో ఒక్కటై ఆనందంగా జీవితాలు గడుపుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ ప్రేమ అనే పేరుతో మోసపోయినవారు.. ప్రేమోన్మాదుల దాడులకు ప్రాణాలు కోల్పోయినవారు, జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో యువతి చేరింది. ప్రేమకు అంగీకరించలేదని ఓ మృగాడు చేసిన విచక్షణారహిత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కాస్త కూడా కనికరం లేకుండా, మనిషి అనే సోయ లేకుండా కత్తి తీసుకుని ఒంట్లో 15 కత్తి పోట్లు దింపాడు. ఎముకలు కూడా విరిగేంత బలంగా కత్తితో ఆ యువతి శరీరాన్ని తూట్లు పొడిచాడు. అతడి నుంచి తనని తాను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించి చివరికి ఆ ప్రేమోన్మాది ఘాతుకానికి బలైంది.
రెండ్రోజుల క్రితం కోనసీమ జిల్లా కరప మండలం కూరాడ గ్రామంలో కాదా దేవిక అనే యువతి హత్య వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె పోస్టుమార్టం రిపోర్టు ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎంత నరకం అనుభవించిం ఉంటుందో అంటూ అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవిక పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు ఏం చెప్పారంటే.. నిందితుడు దేవికను ఇష్టారీతిన పొడిచాడు. దాంతో ఆమెకు ముఖం, మెడ భాగాల్లో బాగా గాయాలు అయ్యాయి. నిందితుడు సూర్యనారాయణ ఆమె కాలర్ బోన్‌లో కత్తి దించి చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో ఆమె మెడలోని రక్తనాళాలు తెగిపోయాయి. అందువల్లే దేవిక మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతను కత్తితో పొడుస్తున్న సమయంలో తన రెండు చేతులు అడ్డుగా పెట్టి దేవిక రక్షించుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అతను మరింత బలంగా దాడి చేయడంతో ఎముకలు కూడా విరిగిపోయాయి. దేవిక రెండు భుజాలు శరీరం నుంచి విడిపోయాయి. ఆమె శరీరంలో మొత్తం 15 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే.. కోనసీమ జిల్లాలోని కె.గంగవరం మండలానికి చెందిన దేవిక.. అమ్మమ్మవాళ్ల ఇల్లైన కరప మండలం కూరాడ గ్రామంలో ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది. ఈమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉంటూ వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. రంగంపేట మండలం బాలవరానికి చెందిన సూర్యనారాయణ కొన్నాళ్లుగా దేవికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇద్దరికీ ఒకే కమ్యూనిటీ కావడంతో ఇబ్బంది కూడా ఉండదని తన ప్రేమకు అంగీకారం చెప్పి.. పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను వేధింపులకు గురిచేస్తూ ఉన్నాడు. ఆమె సూర్యనారాయణ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో అతడిని మందలించారు కూడా. కానీ, అతను వేధింపులు మాత్రం ఆపలేదు. ఇలా మాటువేసి ఆమెపై దాడిచేసి హతమార్చాడు. సూర్యనారాయణను ఉరితీయాలంటూ దేవిక అమ్మమ్మ, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చదువు పూర్తుచేసుకున్న దేవిక కొద్దిరోజుల్లో ఉద్యోగం చేసుకుంటూ చూసుకుంటుందని అనుకుంటే వీడు ఇలా చేశాడే అంటూ గుండెలవిసేలా రోధించింది.