సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు చనిపోయిన విషయం తెలిసిందే. వరంగల్‌లోని స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై శవమైన కనిపించాడు. కాగా అంతకు ముందు రాజును చూసిన రైల్వే సిబ్బంది మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక్ష సాక్షులుగా ఉన్న రైల్వే సిబ్బంది టీ.కుమార్, సారంగపాణి ఏమన్నారంటే.. రోజు మేము ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చి పని ప్రదేశానికి చేరుకునేందుకు ట్రాక్‌పై వెళ్తుంటే, ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పొదల్లోకి వెళ్లి దాకున్నాడు. ఎవరా అని అనుమానం వచ్చి 10 నిమిషాలు అతని కోసం వెతికితే దొరకలేదు.
సరే అని మా పనిపై మేము వెళ్లాం ఒక 200 మీటర్ల దూరం వెళ్లాక రైలు కింద ఎవరో పడ్డారని అక్కడున్న వాళ్లు చెప్తే వెనక్కు వచ్చాం. వచ్చి చూస్తే ఒక వ్యక్తి హైదరాబాద్ వెళ్తున్న కోణార్క్ రైలు కింద పడి చనిపోయాడు. అతను హైదరాబాద్ బాలిక హత్యాచార నిందితుడే అయి ఉండొచ్చని అనుమానం వచ్చి, రివార్డు ఎమన్నా ఇస్తారనుకుని 9.53 నిమిషాలుకు డయల్ 100కు ఫోన్ కూడా చేశామని తెలిపారు. కాగా రాజు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వాళ్లను చూసి భయంతో పారిపోతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొని చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా చిన్నారి జీవితాన్ని చిదిమేసిన వాడికి మరణమే సరైందని ప్రజలు అనుకుంటున్నారు.