దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిజానికి ఈ క్లిష్ట సమయంలో మనిషికి మనిషే ధైర్యాన్ని ఇవ్వాలి. కొంత మంది ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. కానీ.., ఇంకొంత మంది స్వార్ధంతో చేసే పనుల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇంత జరుగుతున్నా.., వీరిలో డబ్బు ఆశ రోజురోజుకీ పెరుగుతూనే పోతోంది. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి ఏలూరు ప్రైవేట్ హాస్పిటల్ లో బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్ బాధితుల అత్యవసర వైద్యానికి వినియోగిస్తున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల బాగా పని చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఈ ఇంజెక్షన్స్ కి గిరాకీ బాగా పెరిగింది. ఇదే అదునుగా ఆ ఇంజెక్షన్స్ ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను ఏలూరు పోలీసులు పట్టుకున్నారు. తాజాగా ఏలూరులోని ఆశ్రం కోవిడ్ ఆస్పత్రికి చెందిన 10 మంది సిబ్బందిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏలూరు ఆశ్రం కోవిడ్ హాస్పిటల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులు, నలుగురు టెక్నీషియన్లు, ముగ్గురు సిబ్బంది ముఠాగా ఏర్పడి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను దారి మళ్లిస్తున్నారు. మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్ను రూ.15 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి కారణంగా ఇప్పటికే ఆ హాస్పిటల్ లో రోగులు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ దొరక్క నానా అవస్థలు పడ్డట్టు తెలుస్తోంది. కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా.., వీరు మాత్రం ఇంజెక్షన్స్ తో వ్యాపారం చేసుకుంటూ.., ఎవ్వరికీ అనుమానం రాకుండా హాస్పిటల్ లోనే విధులు నిర్వహిస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ కేసులో ఏలూరు కొత్తపేట నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన స్టాఫ్నర్స్ వేల్పూరి రేఖాదేవి, దెందులూరుకు చెందిన స్టాఫ్నర్స్ చిగురుపల్లి అరుణ, మరో స్టాఫ్నర్స్ గారపాటి సులోచన ప్రధాన నిందితులుగా పోలీసులు భావిస్తున్నారు. వీరితో పాటు.., హాస్పిటల్ సిబ్బంది అయినా మరో 7 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 27 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, రెమ్డెసివిర్ ఖాళీ వయల్స్ 15, రూ.1.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన నర్స్ లు, డాక్టర్లే ఇలా ప్రవర్తించడం వైద్య వృత్తికి కలంకంగా మారింది. నిజానికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దందాలో ఇది కేవలం ఒక్క సంఘటన మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ముఠాలు చాలానే ఉన్నాయి. అన్నిటికి మించి కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే ఈ దందా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇప్పటికే ఏపీ పోలీసులు ఇలాంటి నాలుగు ముఠాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం విశేషం. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ మెడికల్ మాఫియా ఆగడాలకు పూర్తి స్థాయిలో ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి.