దృశ్యం సినిమా.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఆ తర్వాత అన్ని భాషల్లో రీమేక్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాలో వెంకటేష్, మీనా నటించారు. దృశ్యం 2 కూడా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ తరహా క్రైం స్టోరీలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో ఓ కసాయి కుమార్తె.. ప్రియుడితో కలిసి.. తండ్రిని చంపింది. ఈ దారుణం ఒడిగట్టడానికి ఆమె ఏకంగా దృశ్యం సినిమా పది సార్లు చూసి.. ప్లాన్ వేసినట్లు.. నిందితులు అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తరహా నేరం మరొకటి వెలుగులోకి వచ్చింది. మిస్సింగ్ అయిన వ్యక్తి కేసు దర్యాప్తులో.. ఓ ఇంటి ఫ్లోరింగ్ కింద సంచిలో పాతి పెట్టిన శవం కనిపించింది. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు..
కేరళలో మిస్సింగ్ అయిన వ్యక్తి దర్యాప్తులో వెల్లడైన విషయం దృశ్యం సినిమాను గుర్తుకు తెచ్చింది. నిందితులు హత్య చేసి శవాన్ని ఇంట్లోనే గోనె సంచిలో ఉంచి.. గొయ్యి తీసి.. కప్పి పెట్టారు. పైన కాంక్రీట్‌తో గచ్చు చేశారు. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొట్టాయం జిల్లాకు చెందిన బిందు కుమార్ అనే వారం క్రితం అలప్పుళలో మిస్సింగ్ అయ్యాడు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బిందు కుమార్ కాల్ రికార్డింగ్స్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో అతడు చివరిసారిగా కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తు కుమార్‌తో మృతుడు బిందు కుమార్ మాట్లాడినట్లు వెల్లడయ్యింది. ఈ క్రమంలో పోలీసులు.. ముత్తు కుమార్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించగా.. కొన్నాళ్లుగా అతడి ఇంట్లో మరమత్తు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
దాంతో పోలీసులు.. ముత్తు కుమార్ ఇంట్లో కొత్తగా వేసిన గచ్చును పగలకొట్టారు. అలా 30 నిమిషాల పాటు తవ్వకాలు జరపగా.. వారికి శవం ఉన్న సంచి కనిపించింది. అది బిందుకుమార్‌దేనని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్పష్టత రావడం కోసం మృతదేహాన్ని పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.