“డబ్బు.. డబ్బు.. నువ్వేం చేస్తావని” అడిగితే.. నేనేమీ చేయను నా పేరు చెప్పుకుని మీరే నేరాలు చేస్తారని చెప్తుంది. అలానే అయిపోయింది పరిస్థితి. ధన దాహంతో కట్టుకున్న భార్య అన్న కనికరం భర్తకి ఉండదు, మన కోడలు పిల్లే కదా, కూతురు తర్వాత కూతురే కదా జ్ఞానం అత్త, మామలకి ఉండదు. అసలు కట్నం అడగడమే పాపం . మళ్ళీ అదనపు కట్నం కోసం ఇల్లాలిని హింసించడం ఒకటి. ధన దాహంతో భార్య, ఒక పాప చావుకి కారణమయ్యారు. తన చావుకి తన భర్త, అత్తమామలే కారణమని సూసైడ్ నోట్ రాసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడిందో మహిళ. అంతేకాదు తను పోతే తన పిల్లల్ని ఎవరూ పట్టించుకోరని ఆ పిల్లల్ని కూడా తనతో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా కాలేజ్ సమీపంలో సంపంగి మోహన్ కృష్ణ.. తన అమ్మ, నాన్న, భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. 2017లో సంపంగి మోహన్ కృష్ణకి, శైలజ (34)తో వివాహం జరిగింది. వీరికి తుషిత, అక్షిత అనే ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. మోహన్ కృష్ణకి ఇది రెండో వివాహం. ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్న మోహన్ కృష్ణ.. పెళ్ళైన తర్వాత రోజు నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల కట్నం, రూ. 40 వేలు ఆడపడుచు కట్నం, 10 తులాల బంగారం శైలజ పుట్టింటి వారు పెట్టారు. అయితే ఇవి సరిపోవని రూ. 2 లక్షలు సారి తేవాలంటూ అత్త రామలక్ష్మి, భర్త మోహన్ కృష్ణ శైలజను వేధించడం మొదలుపెట్టారు.
దీంతో శైలజ.. తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు రూ. 50 వేలు మోహన్ కృష్ణకు ఇచ్చారు. మరి మిగతా డబ్బులు ఎప్పుడిస్తారంటూ మళ్ళీ టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. రోజూ సూటిపోటి మాటలతో హింసించడం, భర్త తాగొచ్చి కొట్టడం లాంటివి చేసేవారు. తనకు బాబు కావాలని, నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా అంటూ అత్త వేధించేది. ప్రతిసారీ చచ్చిపో.. చచ్చిపో అంటున్నారని ఇంట్లో వాళ్ళతో చెప్పి బాధపడేది. అస్తమానూ తన చావు కోరుకుంటున్నారని విరక్తి చెందిన శైలజ చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తను పోయాక తన ఆడ బిడ్డల్ని వీళ్ళు రోడ్డున పడేస్తారని తనతో పాటు తీసుకెళ్లిపోవాలనుకుంది.
“మా చావుకి భర్త, అత్తలే కారణం. తనను ఇద్దరూ చాలా చిత్రహింసలు పెట్టారని, వాళ్ళసలు మనుషులే కాదు. నేను చనిపోతే నా పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తారు. అందుకే నాతొ పాటు నా పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోతున్నాను” “మా చావుకి భర్త, అత్తలే కారణం. తనను ఇద్దరూ చాలా చిత్రహింసలు పెట్టారని, వాళ్ళసలు మనుషులే కాదు. నేను చనిపోతే నా పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తారు. అందుకే నాతొ పాటు నా పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోతున్నాను” అంటూ సూసైడ్ లెటర్ రాసింది. అనంతరం ఈ నెల 29న పిల్లలకి దోమల మందు తాగించి.. తాను కూడా తాగింది. అది గమనించిన మోహన్ కృష్ణ, అతని తల్లి రాత్రి 8 గంటల సమయంలో శైలజను, పిల్లలని మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం శైలజ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే దురదృష్టవశాత్తు శుక్రవారం తెల్లవారుజామున శైలజ, తన చిన్న కూతురు అక్షిత మృతి చెందారు. పెద్ద కూతురు తుషిత (4) ప్రాణాలతో పోరాడుతుంది. శైలజ, పాప మృతి చెందడంతో మోహన్ కృష్ణ ఆస్పత్రి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహన్ కృష్ణ కోసం గాలిస్తున్నారు. శైలజ, పాప అక్షితల మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.